ఆ హక్కు సంచయితకు లేదు... అప్పుడే సెటిల్‌మెంట్ జరిగిపోయింది.. : సుధా గజపతి రాజు
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయితను నియమించిన నాటి నుంచి వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సంచయిత నియామకాన్ని ఆమె బాబాయి ఆశోక్ గజపతి రాజు తొలి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఆనంద గజపతి రాజు రెండో భార్య సుధా,కుమార్తె ఊర్మిళ సైతం సంచయితకు ఎదురు తిరిగారు. ఆనంద గజపతిరాజుకు అసలు వారసులం తామేనని.. పేరు చివరన గజపతిరాజు అని వాడుకునే హక్కు ఆమెకు లేదని వారు అంటున్నారు.

1991లో విడాకులు.. సెటిల్‌మెంట్..
ఆనంద గజపతి రాజు,సంచయిత తల్లి ఉమా పరస్పర అంగీకారంతో 1985లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని సుధా గజపతి రాజు తెలిపారు. 1991లో చట్ట ప్రకారం వారికి విడాకులు అయ్యాయన్నారు. అలాగే ఆస్తుల పంపకాలు,ఫ్యామిలీ సెటిల్‌మెంట్స్ కూడా జరిగాయన్నారు. కోర్టు తీర్పు కాపీలో ఈ విషయాలన్నీ స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు.

ఊర్మిళ అంటే ఆనందగజపతిరాజుకు ఎనలేని ప్రేమ..
1991లో ఉమాతో విడాకుల అనంతరం ఆనంద గజపతి రాజు తనను వివాహం చేసుకున్నట్టు సుధా తెలిపారు. 1992లో తమకు పాప ఊర్మిళ జన్మించిందన్నారు. పాప విజయనగరంలనే పుట్టిందని,ఆ తర్వాత సింహాచలం,విశాఖల్లో పెరిగిందని చెప్పారు. ఆనంద గజపతిరాజుకు ఊర్మిళ అంటే ఎనలేని ప్రేమ అని తెలిపారు. ఆయన ఎవరితో మాట్లాడినా... 'నా ఆస్తి అంతా ఒకవైపు... నా కూతురు ఊర్మిళ ఒకవైపు..' అని చెప్పేవారని గుర్తుచేసుకున్నారు.

ఇచ్చిన ఆస్తులు అమ్మేసుకుని..
ఉమాతో విడాకుల సమయంలో ఆనంద గజపతి రాజు సెటిల్‌మెంట్ కింద ఆమెకు విజయనగరం మార్కెట్‌లోని దుకాణాలు,ఊటీలోని ఆస్తులు,బంగారం,వజ్రాలు వంటివి ఇచ్చారని సుధా తెలిపారు. అయితే వాటన్నింటిని అమ్మేసుకుని.. ఇప్పుడు మళ్లీ ఆయన వారసులమంటూ సంచయిత తెర పైకి రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆనంద గజపతిరాజును కలవకుండా సంచయితను తాను అడ్డుకున్నానని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.
Recommended Video

ఆనంద గజపతి రాజు చనిపోయినప్పుడు..
ఎప్పుడో చిన్నప్పుడు వెళ్లిపోయింది.. ఇప్పుడెలా ఉందో చూసి రావాలని.. అప్పుడప్పుడూ తానే సంచయిత గురించి ఆనంద గజపతిరాజుకు గుర్తుచేసేదాన్ని అని సుధా తెలిపారు. ఆఖరికి ఆయన చనిపోయినప్పుడు కూడా... సంచయిత ఐదో రోజున అక్కడికి వచ్చిందన్నారు. కాసేపటికే.. తన డాడీ బర్త్ డే ఉందంటూ అక్కడి నుంచి వెళ్లిపోయిందన్నారు. చెన్నైలోని ఆస్తులకు సంబంధించి సంచయిత సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలను కూడా సుధా కొట్టిపారేశారు. ఆనంద గజపతిరాజు వారసత్వం విషయంలో తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని.. తామే ఆయనకు అసలైన వారసులమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications