ఏపీలోని ఈ జిల్లాలు విలవిల
ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమౌతోంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఉపరితల ఆవర్తనం వల్ల మొన్నటివరకు వర్షాలు పడ్డాయి గానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి.

ఈ రెండు నెలల్లో ఎండ తీవ్రత 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ అంచనాలను నిజం చేస్తూ గురువారం నాడు శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 45.4 డిగ్రీల సెల్సియస్ మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత 24 గంటల్లో ఇదే అత్యధికం. రెండో స్థానంలో కడప జిల్లా నిలిచింది. కడప పట్టణం, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 45.1 డిగ్రీల సెల్సియస్ చొప్పున, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అలాగే 26 జిల్లాల్లో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే తీవ్రత నేడు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నేడు రాష్ట్రంలో 62 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 89 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎండ తీవ్రత నేపథ్యంలో బయటకు వెళ్లేప్పుడు తలకి టోపీ లేదా కర్చీఫ్, తెలుపు రంగు కాటన్ వస్త్రాలు ధరించాలని, ఎండ తీవ్రత కళ్లపై పడకుండా ఉండేలా సన్ గ్లాసెస్ ఉపయోగించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications