ఏపీని ఇట్టా పట్టుకున్నాయేంట్రా సామీ: ఇంకో 5 రోజులు అతి భారీవర్షాలు
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజులుగా ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవే పరిస్థితులు ఈ వారం కూడా కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
దీనికి కారణం- బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం. ఈ నెల 17వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడింది. అల్పపీడనంగా మారింది. ఇది మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ మధ్యాహ్నానికి దక్షిణమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారడానికి వాతావరణం అనుకూలంగా ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. బుధవారం రాత్రి సమయానికి ఈ అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది.

అదే ప్రాంతంలో ఈ మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని, నైరుతి- దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతం కదులుతుందని విపత్తు నిర్వహణ సంస్థ వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఈ వాయుగుండం ప్రభావం ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉంటోంది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో అయిదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రఖర్ జైన్ తెలిపారు. నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు.
నేడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ-అతిభారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. గురువారం నాడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ-అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని సూచించారు.












Click it and Unblock the Notifications