వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇవి చేయొద్దు!
వర్షాకాలం కాబట్టి వానలు జోరుగా కురుస్తున్నాయి. అత్యవసర పనులున్నప్పుడు తప్పనిసరిగా బయటకు వెళ్లాలి. ఎంత జాగ్రత్తగా వెళ్లినప్పటికీ వర్షంలో తడవాల్సిన పరిస్థితి వస్తుంది. వానల్లేవని బయలుదేరినా.. మధ్యలో ఒక్కసారిగా కుండపోతగా వాన కురుస్తుంది. ఇటువంటి సమయాల్లో మొబైల్ ఫోన్ తడిసిపోతే ఎంతో టెన్షన్ పడతాం. ఫోన్ తడిసిన వెంటనే చేయకూడని పనులు కొన్నివుంటాయి.. అవేంటో తెలుసుకుందాం.
చాలామంది ఫోన్ తడిసిన తర్వాత సరిగా పనిచేస్తుందో లేదో ఆపరేట్ చేస్తుంటారు. అలా చేయకూడదు. డివైజ్ లోపలికి నీళ్లు పోయాయి అనిపిస్తే వెంటనే స్విచాఫ్ చేయాలి. ప్రధానంగా ఫోన్ షార్ట్ సర్క్యూట్ కాకుండా, లోపలి భాగాలు పాడవకుండా ఉంటాయి. చాలామంది పోతే పోయాయిలే తర్వాత చూసుకుందామంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అలాగే ఫోన్ వాడుతుంటారు. కానీ దీనివల్ల మొబైల్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.

ఫోన్ స్విచ్చాఫ్ చేసి వెంటనే సిమ్ కార్డ్, మెమొరీ కార్డ్ తీసెయ్యడంతోపాటు ప్రొటెక్టివ్ కేస్ తొలగించాలి. వాటర్ ఉంటే మెత్తటి క్లాత్ తీసుకొని నెమ్మదిగా తుడవాలి. బటన్, హెడ్‌ఫోన్ జాక్, పోర్ట్స్‌లో నీళ్లున్నా తుడవాలి. హెయిర్ డ్రయర్ అసలు ఉపయోగించకూడదు. వీటి వేడి వల్ల ఫోన్ డ్యామేజ్ అవుతుంది. డబ్బాలో బియ్యం పోసి, అందులో తడిసిన ఫోన్ ను ఉంచాలి. సిలికా జెల్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంటే ఓ డబ్బాలో వేసి, ఫోన్ ను అందులో ఉంచాలి. కనీసం 24 గంటలసేపన్నా అలా ఉంచాలి. ఇలా చేస్తే ఫోన్‌లో ఉన్న తేమను అవి పీల్చేస్తాయి. మొబైల్ మరీ ఎక్కువగా డ్యామేజ్ అయిందనిపిస్తే స్విచాఫ్ చేసి దగ్గర్లో ఉన్న సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి.
బయట ఎక్కువగా తిరిగేవారు వర్షాకాలంలో మొబైల్ కవర్ కొనాలి. తక్కువ ధరలోనే దొరుకుతాయి. ప్లాస్టిక్ కవర్లలో కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల లోపలికి నీళ్లు పోవు. స్విమ్మింగ్ చేసేవారు కూడా ఇలాంటి మొబైల్ కవర్స్ ఉపయోగించొచ్చు.












Click it and Unblock the Notifications