టీడీపీ బీసీ నేత బుద్ధా వెంకన్నకు మెండిచెయ్యి: చౌదరికి టికెట్
Sujana Chowdary: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష తెలుగుదేశం.. మరోసారి కూటమి కట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి జనసేన- భారతీయ జనతా పార్టీలను ఆశ్రయించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలోనూ చేరింది.
కూటమి మధ్య సీట్ల పంపకాల వ్యవహారం పూర్తిస్థాయిలో కొలిక్కి రావట్లేదు. అయిదు మినహా మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. జనసేనలో కూడా సీట్ల కేటాయింపు దాదాపుగా ముగిసినప్పటికీ- తుది జాబితా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. బీజేపీ జాబితా ఈ సాయంత్రానికి వెలువడొచ్చు.

ఈ పొత్తుల వ్యవహారంలో మరో అడుగు ముందుకు పడినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీ దక్కించుకోగలిగింది. కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సుజనా చౌదరి ఇక్కడ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టే.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకుడు శ్రీరామ్ సైతం విజయవాడ వెస్ట్ సీటును కోరుకుంటోన్నట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ స్వయంగా ఆయన పేరును సూచించినట్లు చెబుతున్నారు. సుజనా చౌదరికి టికెట్ ఇవ్వడానికి అటు బీజేపీ రాష్ట్రశాఖ కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే- పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మంత్రివర్గంలో బీజేపీ తరఫున సుజనా చౌదరికి బెర్త్ లభించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని ఎప్పటి నుంచో కోరుకుంటోన్నారు టీడీపీకి చెందిన బీసీ నాయకుడు బుద్ధా వెంకన్న. ఇటీవలే చంద్రబాబు జిందాబాద్ అంటూ రక్తంతో గోడల మీద స్లోగన్లు కూడా రాశారు. అయినప్పటికీ ఆయనకు టికెట్ దక్కే అవకాశం ఎంత మాత్రం లేదని సమాచారం. బుద్ధా వెంకన్న కూడా సుజనా చౌదరి కోసం పని చేస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications