టీడీపీతో వచ్చే ఎన్నికల్లో పొత్తుపై తేల్చేసిన బీజేపీ: జనసేన ఎటువైపో మరి!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పుట్నుంచే పొత్తులపై రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం పొత్తులపై క్లారిటీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.

చర్చనీయాంశంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ
ఇప్పటికే బీజేపీ, జనసేన పార్టీలు పొత్తుతో కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆ పొత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. అన్ని పార్టీలు ఏకంగా కావాలని చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా వైసీపీని గద్దె దించేందుకు పార్టీలు కలవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

జనసేనతోనే బీజేపీ.. టీడీపీతో పొత్తు లేదన్న సునీల్ దేవ్‌ధర్
ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దేవ్‌ధర్ పొత్తులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్నారు. అయితే, టీడీపీతో మాత్రం తాము పొత్తు పెట్టుకోమని సునీల్ స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడిగిన రోడ్ మ్యాప్‌పై అంతర్గతంగా చర్చించుకుంటామన్నారు.

ప్రజలకే వైసీపీ వెన్నుపోటంటూ సునీల్ దేవ్‌ధర్
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారాన్ని తాము సీరియస్‌గా తీసుకోవట్లేదన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ మధ్య ఎలాంటి విభేదాలు లేవని సునీల్ దేవ్ ధర్ తెలిపారు. ఏపీలో ఓటు వేసిన ప్రజలకే వైసీపీ వెన్నుపోటు పొడుస్తోందని ఆయన విమర్శించారు.

జనసేన బీజేపీతోనా?.. టీడీపీతో వెళుతుందా?
ఇది ఇలావుండగా, పవన్ కళ్యాణ్ ఏపీలో బీజేపీతో కలిసి వెళతారా? లేక టీడీపీతో కలిసి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది. వైసీపీని ఓడించాలంటే 2014 ఎన్నికల్లో లానే మూడు పార్టీలు కలిసి పోటీ చేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఇందుకు టీడీపీ, జనసేనలు కొంత సుముఖంగా ఉన్నప్పటికీ.. బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పడు జరిగిన పరిణామాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో చివరకు జనసేన టీడీపీతో ఉంటుందా? బీజేపీతో వెళుతుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. దీనిపై క్లారిటీకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications