జగన్ కేసుల విచారణపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం..!!
జగన్ అక్రమాస్తుల కేసులపై ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీతో పాటు జగన్ బెయిల్ రద్దు చేసి విచారణ వేగవంతం చేయాలంటూ రఘురామ పిటిషన్ దాఖలు చేసారు.దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి సీబీఐపై అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను నవంబర్ నెలకు సుప్రీంకోర్ట్ వాయిదా వేసింది.
ధర్మాసనం విచారణ
రఘురామకృష్ణ రాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై రెండుసార్లు ధర్మాసనం విచారణ జరిపింది. ఉదయం, మధ్యాహ్నం భోజనం విరామ అనంతరం విచారణ జరిపింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు షాకింగ్‌గా అనిపిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో చెప్పిన అంశాలు ఆశ్చర్యకరమని అన్నారు. కేసులు ట్రయల్ ప్రారంభం కాకుండా... ఇన్ని కేసులు ఎలా ఫైల్ చేశారని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు.

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
రఘురామ పిటిషన్లపై ఈ ఏడాది మే 2న సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు వివరాలు, పురోగతిని సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. డిశ్చార్జ్ పిటిషన్లు వేసి విచారణ ముందుకు సాగనివ్వటం ట్లేదని తెలిపింది. ఈ కేసులో ఇప్పటికి 39 క్వాష్, 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొంది. క్వాష్, డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పులు ఇచ్చేలోపే జడ్జీలు బదిలీ అవుతున్నారని వివరించింది. ఈ కేసులో ఉన్న నిందింతులంతా శక్తిమంతులే అని సీబీఐ నివేదికలో వెల్లడించింది. అయితే సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు.
విచారణ వాయిదా
ఈ క్రమంలోనే ఆరుగురు జడ్జిలు మారిపోవడం, రిటైర్ కావడం జరిగిందని రఘురామ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పు అంటూ కాలయాపన చేస్తున్నారని జస్టిస్ సంజీవ్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. దీనికి, ట్రయల్‌కి సంబంధం లేదని ఆయన అన్నారు. డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని ట్రయల్ ముందుకు సాగకుండా ఇది అడ్డంకిగా మారుతోందని న్యాయస్థానానికి సీబీఐ వివరించింది. తదుపరి విచారణ కోసం ఈ కేసును నవంబర్ కు వాయిదా వేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications