YCP నాయకుడికి మద్దతుగా TDP
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి అండగా తెలుగుదేశం పార్టీ నిలబడింది. ఆయనకు మద్దతుగా టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు వైఎస్సార్ సీపీ అసమ్మతి నేత సుబ్బారావుగుప్తాను గంజాయి కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
సుబ్బారావుపై అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారంటూ తెలుగుదేశం పార్టీ వానిజ్య విభాగం ఆధ్వర్యంలో ఒంగోలులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి గాంధీ రోడ్డులోని గాంధీజీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్ తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

అక్రమ కేసు బనాయించారు?
సుబ్బారావు గుప్తాపై అక్రమ కేసు బనాయించడం దారుణమని. రాష్ట్రంలోని వైశ్యులపై వైఎసస్సార్‌సీపీ నేతలు దాడులు చేయించి కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వైశ్యులు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని.. గుప్తాపై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్యవైశ్యులని అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు సుబ్బారావు గుప్తా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వివాదాస్పద వ్యాఖ్యలు
సోమిశెట్టి సుబ్బారావు గుప్తా దగ్గర గంజాయి ఉందని ఒంగోలులోని మంగమ్మ కళాశాల దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను పోలీస్ స్టేషన్‌కు తరలించి కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్ విధించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డిపై గుప్తా విమర్శలు చేసిన కొద్దిరోజులకే గంజాయి కేసులో అరెస్ట్ అయ్యారు. వైసీపీకి చెందిన సుబ్బారావు గుప్తా అప్పుడు మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తర్వాత పార్టీ తీరుపై విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవడంతో గుప్తా ఇంటిపై దాడిజరిగింది.

సుభానీని అరెస్ట్ చేసిన పోలీసులు
గుంటూరు వెళ్లిన గుప్తా ఓ లాడ్జిలో తలదాచుకున్నారు. ఒంగోలుకు చెందిన సుభానీ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త సుబ్బారావుపై లాడ్జిలో దాడి చేసిన వీడియో కూడా వైరలవగా పోలీసులు కేసు నమోదు చేశారు. సుభానీని అరెస్ట్ చేయడంతోపాటు సుబ్బారావు గుప్తా వెళ్లి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలవడంతో వివాదం సద్దుమణిగింది.
కొద్దిరోజుల తర్వాత గుప్తా సొంత పార్టీపై మరోమారు విమర్శలు చేశారు. తన ప్రాణాలకు ముప్పందంటూ సెక్యూరిటీ ఇవ్వాలని కోరారు. ఢిల్లీ వెళ్లి నిరసనకు దిగిన సుబ్బారావుపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదవడంతోపాటు తాజాగా గంజాయి కేసులో అరెస్ట్ అయ్యారు.












Click it and Unblock the Notifications