బాలయ్య ఏం చేయబోతున్నారు?
Nandamuri Balakrishna: శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంపై అందరి కళ్లూ నిలిచాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ఒక్కసారి కూడా ఓడిపోని ఈ నియోజకవర్గాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా కైవసం చేసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.
వెనుకబడిన సామాజిక వర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం ఇది. ఆ తరువాత రెడ్డి, కమ్మ సామాజికవర్గ ఓటుబ్యాంకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుంది. హిందూపురం, లేపాక్షి, చీలమత్తూరు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. 2019 నాటి ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల్లోని 52 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుచుకున్న మూడు స్థానాల్లో ఇదీ ఒకటి.

హిందూపురం.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983లో ఆవిర్భావించినప్పటి నుంచీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో ఓటమి చవి చూడలేదు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మూడుసార్లు ఇక్కడి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పామిశెట్టి రంగనాయకులు, నందమూరి బాలకృష్ణ రెండుసార్లు చొప్పున విజయం సాధించారు.
నందమూరి హరికృష్ణ, సీసీ వెంకట్రాముడు, పీ అబ్దుల్ ఘనీ ఒక్కోదఫా హిందూపురం అభ్యర్థులుగా పోటీ చేసి విజయఢంకా మోగించారు. ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గానికి బాలయ్య ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు బీ నవీన్ నిశ్చల్, 2019లో మహ్మద్ ఇక్బాల్‌ను ఆయన ఓడించారు.
ప్రస్తుతం ఇక్బాల్‌ను వైఎస్ఆర్సీపీ నాయకత్వం శాసన మండలికి ఎంపిక చేసింది. దీనితో ఈ నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిని వెదుక్కునే పనిలో పడింది. ఇప్పుడా అన్వేషణకు తెర దించింది వైఎస్ఆర్సీపీ. నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకురాలు టీఎన్ దీపికను ఇన్‌ఛార్జీని అపాయింట్ చేసింది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో హిందూపురం టికెట్.. ఆమెకే కేటాయించడం దాదాపు ఖాయమైనట్టే.
పార్టీ సీనియర్ నేత, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫారసుల మేరకే వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు మహిళా అభ్యర్థులెవరూ పోటీ చేయలేదు. ఏ పార్టీ కూడా ఓ మహిళ నాయకురాలిని తమ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలపలేదు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్సీపీ దీపికను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. ఈ మహిళా అస్త్రాన్ని నందమూరి బాలయ్య ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తి రేపుతోంది. ఈ దఫా గెలిస్తే- ఇక్కడ హ్యాట్రిక్ కొట్టినట్టవుతుంది.












Click it and Unblock the Notifications