టీడీపీ భవిష్యత్ గ్యారెంటీ: బాబును ఎక్కడ అరెస్ట్ చేశారో అక్కడి నుంచే..!!
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. డజనుకు పైగా సూట్‌కేస్ కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే విషయం దర్యాప్తులో తేలడంతో సీఐడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

దీని తరువాత పలు కేసులు చంద్రబాబును చుట్టుముట్టాయి. ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలోనూ ఆయనపై కేసు నమోదైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని అంగళ్లు వద్ద చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులపై దాడి చేయడం-వాహనాలు తగులబెట్టిన ఘటనలోనూ కేసులు ఫైల్ అయ్యాయి.
ఈ పరిస్థితుల మధ్య తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నెల 21వ తేదీన అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. చంద్రబాబు అరెస్టు తరువాత ఇప్పటివరకు ఈ స్థాయి సమావేశం ఏర్పాటు కాలేదు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు పార్టీ సీనియర్ నేతలు.
చంద్రబాబు అరెస్ట్ కాకముందు- మీ భవిష్యత్‌కు గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని చేపట్టారాయన. నంద్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారప్పట్లో. ఈ సభ తరువాత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. నంద్యాల నుంచి రోడ్డుమార్గంలో విజయవాడకు తరలించారు. విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు.
ఇప్పుడు అదే నంద్యాల నుంచి భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ బాధ్యతను నారా లోకేష్ తీసుకోనున్నారు. విజయదశమి రోజు లేదా పండగ కోలాహలం ముగిసిన తరువాత దీన్ని నంద్యాలలో రీలాంచ్ చేస్తారు నారా లోకేష్. గతంలో రూపొందించిన రోడ్ మ్యాప్‌కు అనుగుణంగానే దీన్ని కొనసాగిస్తారు.
అదే సమయంలో- చంద్రబాబు అరెస్టు వార్త విని మరణించిన వారి కుటుంబాలను పరామర్శించాలని టీడీపీ నిర్ణయించింది. దీన్ని భువనేశ్వరి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ఎలా ఉండాలనే విషయంపై టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications