కీలక దశకు వివేకా హత్యకేసు దర్యాప్తు: హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్..!!
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ కేసును విచారిస్తోన్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ అధికారులు ఇప్పటికే కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు.
ఇదే కేసులో ఆయన కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి విచారణను ఎదుర్కొంటోన్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. ఈ నెల 25 వరకు అంటే ఇవ్వాళ్టి వరకు ఆయనను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటీషన్‌పై తుది తీర్పు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. అవినాష్ విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.

ఈ ముందస్తు బెయిల్ పిటీషన్ గడువు ఇవ్వాళ్టితో ముగిసిపోనుంది. దీనితో మరోసారి వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్లు ఇవ్వాళ తెలంగాణ హైకోర్టు సమక్షానికి విచారణకు రానున్నాయి. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ 18వ తేదీన ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు పక్కనబెట్టిన నేపథ్యంలో- ప్రస్తుతం అందరి దృష్టీ తెలంగాణ హైకోర్టు మీదే నిలిచింది. ఎలాంటి తీర్పు వెలువడుతుందనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
వైఎస్ అవినాష్ రెడ్డిని ఏప్రిల్ 25 వరకు అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత ఈ పిటీషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా, వైఎస్ అవినాష్ రెడ్డి తరపున ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.
వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఇదివరకే ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేశారు. చార్జిషీట్‌లో వైఎస్ అవినాష్ రెడ్డి పేరును పొందుపరిచారు. ఆయన విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయొద్దంటూ సీబీఐ అధికారులను ఆదేశించాలంటూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సానుకూలంగా స్పందించింది హైకోర్టు. ఇవ్వాళ్టి వరకు రిలీఫ్ కల్పించింది. గడువు ముగిసిన నేపథ్యంలో- ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications