వాళ్లను అరెస్ట్ చేస్తే నేను లేనా?
చరిత్ర పుస్తకాలు పెద్దగా ఈ మహాను భావుడి గురించి పెద్దగా చెప్పలేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఉయ్యలవాడ (సైరా నరసింహారెడ్డి) సినిమాతో ఆయన చరిత్ర మనందరికీ తెలిసింది. తెలుగులో ఇంకా చరిత్రకెక్కని వీరులు ఎందరో ఉన్నారు. విశాఖపట్నం జిల్లా కు చెందిన దేవుడు బాబు ఒకరు. ఈయన పేరు నేటియువత ఎక్కడా వినిఉండదు. ఆయన జన్మించిన విశాఖ వాసులకే తెలియదు బాబు గురించి. ఆయన గొప్పతనం ఏమిటో తెలుసుకుందాం.
మహాత్మాగాంధీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహం, విదేశీ హటావో, ఖాదీ ఉద్యమం తదితర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని, జైలుకి వెళ్లి, లాఠీ దెబ్బలు తిన్నవారు ఎందరో ఉన్నారు. అటువంటి స్వాతంత్య్ర సమరయోధులు చరిత్రలో కనుమరుగయ్యారు. వారిలో పూడిపెద్ది సుందరరామయ్య ఒకరు. 12-8-1912న విశాఖపట్నంలో జన్మిం చి, 1982 సెప్టెంబర్ 23న, తన 70వ ఏట మరణించారు.

1929లో గాంధీజీ పిలుపుమేరకు, న్యాయశాస్త్రంలో పట్టా కోసం జరిగే పరీక్షలను సైతం వదులుకుని, అతి పిన్న వయసులోనే, తన 17వ ఏట స్వాతంత్య్రం కోసం పోరాడిన యువకుడుగా సుందరరామయ్య గుర్తింపు పొందారు.హార్బర్‌లో టైం ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. అయితే బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన వాచీ పెట్టుకుని పని చేయాలని ఒక బ్రిటిష్ అధికారి చెప్పడంతో అది నచ్చక ఉద్యోగంలో చేరిన తొలి రోజే రాజీనామా చేశారు.
పేదవారైన స్వాతంత్య్ర సమరయోధులను జైలులో పెట్టినప్పుడు వారి కుటుంబ సభ్యులందరికీ మూడుపూటలా ఇంట్లో వండించి క్యారేజీలు పంపించేవారు. వీటితోపాటు మందులు, బట్టలు, డబ్బు కూడా ఇచ్చేవారు. గర్భిణీ స్త్రీలకి నొప్పులొస్తే, తన కారు, డ్రైవర్‌ని ఇచ్చి వాళ్ళని హాస్పిటల్ కు పంపించేవారు. స్టోన్ హౌస్ అనే ఇల్లు కట్టించి, అందులో, 105 మంది పేద పిల్లలకి పెళ్లిళ్లు చేయించారు.
తన ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని ఉచితంగా పేదలకు ఇచ్చారు. నూకరాజు కార్ల రిపేర్ షెడ్, దేవుడమ్మ టీ దుకాణం పెట్టుకుని ఇలాగే ఉపాధిని పొందారు. విశాఖపట్నంలో పూడిపెద్ది సుందరరామయ్యను దేవుడు బాబు అని పిలుస్తారు. ఇలాంటి వీరుడి గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది.












Click it and Unblock the Notifications