కేబినెట్ భేటీ: కొత్త పెన్షన్ల కు ఆమోదం, ముందుగా వారికే - స్థానిక ఎన్నికల్లో ఇలా..!!
స్థానిక ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త పెన్షన్ల పంపిణీ పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. అమరావతిలో నిర్మాణాల పైన కొత్త నిర్ణయాల పై కసరత్తు జరుగుతోంది. పెట్టుబడులు.. ఉద్యోగాల తో పాటుగా ఎల్ నినో ప్రభావం పైన కేబినెట్ చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇక.. డీఎస్సీ వివాదం.. తాజా పరిణామాల పైన అజెండా తరువాత మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.
ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పలు నిర్ణయాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం దాదాపు 13.40 లక్షల మంది దరఖాస్తు చేసారు. వారికి దశల వారీగా పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా వితంతు,
వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. దీని పైన ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో చర్చ తరువాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. దసరా నుంచి వీటి పంపిణీ సాధ్యాసాధ్యాల పైనా నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా స్థానిక ఎన్నికల పైనా మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. బీసీ రిజర్వేషన్ల అమలు... మేయర్ సీట్ల రిజర్వేషన్ తో సహా క్షేత్ర స్థాయిలో కూటమి సమన్వయం.. సీట్ల సర్దుబాటు పైనా సూచనలు చేయనున్నారని సమాచారం. ఇప్పటికే పవన్ తన వైఖరి స్పష్టం చేయటంతో చంద్రబాబు నిర్ణయం కీలకం కానుంది.

స్థానిక ఎన్నికల పై కీలక నిర్ణయాలు
కాగా..ఇటీవల జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు ఈ భేటీలో మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. ప్రధానంగా అమరావతి పునర్నిర్మాణం, రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన, భూ సమీకరణ సంబంధిత అంశాలు అజెండాలో ప్రముఖంగా ఉండనున్నాయి. వీటితో పాటు రాష్ట్రానికి నూతన పెట్టుబడులను ఆకర్షించే అంశాలపై కూడా కేబినెట్ దృష్టి సారించనుంది. ఐటీ రంగంలో సుమారు రూ. 526 కోట్లకు పైగా విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు ఈ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది. అదేవిధంగా, రాష్ట్రంలోని వర్షాభావం, కరువు పరిస్థితులు, తుపాను ప్రభావం మరియు తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఈ సందర్భంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications
