పోటెత్తిన తిరుమల: అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా 2.60 లక్షల మంది భక్తులు
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వేలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని, తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. వారాంతపు రోజుల్లో ఈ తాకిడి మరింత అధికంగా ఉంటోంది. సాధారణ రోజులతో పోల్చుకుంటే రెట్టింపు అవుతోంది.
శుక్రవారం నాడు 70,668 మంది శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. వారిలో 38,036 మంది తలనీలాలను సమర్పించారు. హుండీ ద్వారా 3.64 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. సర్వదర్శనం టోకెన్లు ఉన్న వారికి స్వామివారి దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పట్టింది.

కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. క్యూ లైన్‌లో ఉన్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అల్పాహారం, పాలు, మంచినీటి వసతిని కల్పించారు. ఈ రద్దీ మరిన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు.
10 రోజుల వ్యవధిలో శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాల ద్వారా మాత్రమే సుమారు 2.60 లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకొన్నారంటే భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వారందరికీ స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు టీటీడీ అధికారులు.
శిలాతోరణం, బాట గంగమ్మ గుడి మార్గాల్లో శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో ఉన్న భక్తుల సౌకర్యం కోసం మొత్తం 27 ప్రాంతాల్లో మంచినీరు, నాలుగు ప్రాంతల్లో అన్నప్రసాదాల అందిస్తోన్నారు. దీనికోసం అదనపు సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచారు.
భక్తుల సౌకర్యార్థం అక్టోపస్ భవనం నుంచి శిలాతోరణం వరకు ప్రత్యేకంగా ఎనిమిది బస్సులు ఏర్పాటు చేశారు. ప్రతి నిమిషానికి ఒక బస్సు అందుబాటులో ఉంటుంది ఈ రూట్‌లో. ఈ బస్సుల ద్వారా భక్తులను గమ్యస్థానాలకు చేరవేసేలా చర్యలు తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 46, 486 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.
తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవన సముదాయంలో శనివారం మధ్యాహ్నానికి దాదాపు 60,000 మందికి పైగా అన్న ప్రసాదాన్ని అందించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో 50,000 మందికి ఉప్మా, పొంగలి వంటి అల్పాహారాన్ని పంపిణీ చేశారు. క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు












Click it and Unblock the Notifications