24న తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం జూన్ 24న రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వెల్లడించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను విడుదల చేయనుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ ఆర్జిత సేవా టికెట్లు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. జూన్ 20న ఉదయం 10 గంటల వరకు టికెట్ల నమోదుకు టీటీడీ అవకాశం కల్పించింది. ఆ రోజున మరిన్ని టికెట్లు విడుదల చేయనుంది.
జూన్ 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్ల విడుదల
జూన్ 22న ఉదయం 10 గంటలకు అంగప్రదిక్షిణ టోకెన్లు విడుదల
జూన్ 22న ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్లు విడుదల
జూన్ 22న మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు విడుదల
జూన్ 24న రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల

జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం
తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది. అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి, శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైఖానసాగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గల కల్యాణ మండపంలో ఈ ఉత్సవం చేపడతారు. దీనిని 'అభిధేయక అభిషేకం' అని కూడా అంటారు.
మొదటిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత స్వామి, అమ్మవార్లకు వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు. రెండో రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. మూడో రోజు కూడా తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు.
ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు కవచంతోనే ఉంటారు. జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 21వ తేదీ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications