TTD: భక్తులకు టీటీడీ అరుదైన అవకాశం - ఆన్ లైన్ బుకింగ్, ఇక ఇంటి వద్దకే..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తుల సేవల్లో టీటీడీ కీలక మార్పులు తీసుకొస్తోంది. దర్శనంతో పాటుగా వసతి విషయంలో పలు నిర్ణయాలు అమలు చేస్తోంది. ఈ నెల 20 తేదీన దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ఇందు కోసం 20న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇక.. భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం వెల్లడించింది.
శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 20 తేదీన దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబరు 20న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

ఇక, శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆఫ్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది. 2026 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్దసైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను టిటిడి అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా తిరుమల, తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ఎదురుగా సేల్స్ సెంటర్, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లోనూ, తిరుచానూరులో ఉన్న టిటిడి పబ్లికేషన్ స్టాల్స్‌లలో అందుబాటులో ఉన్నాయి.
అదే విధంగా విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్ లోని హిమయత్ నగర్ లోని ఎస్వీ ఆలయం, జూబ్లీహిల్స్ లోని ఎస్వీ ఆలయం, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, వేలూరులతో పాటు రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులోని కళ్యాణమండపాల్లో 2026 సంవత్సరం క్యాలెండర్‌లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచింది. టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారి ఇంటి వద్దే టిటిడి డైరీలు, క్యాలండర్లను పొందే సౌలభ్యం కల్పించారు. టిటిడి క్యాలెండర్ లు, డైరీలను టిటిడి వెబ్ సైట్ ద్వారా (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) ఆన్ లైన్ లో పొందవచ్చు.












Click it and Unblock the Notifications