తిరుమలలో అరుదైన వైదిక క్రతువులు
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 70,480 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28,923 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.17 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- తిరుమలలో శనివారం రాత్రి శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. సాయంత్రం 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు.. గరుడ వాహనారూఢుడై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. భక్తులను కటాక్షించారు. వేలాదిమంది భక్తులు మలయప్ప స్వామివారిని దర్శించుకున్నారు. హారతులు పట్టారు.
ఈ పౌర్ణమి గరుడ సేవ వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే ప్రతిష్టాత్మక గరుడ సేవకు ముందు జరుగుతున్న కారణంగా టీటీడీ ట్రయల్ రన్ గా గరుడ సేవను నిర్వహించింది. ఈ సందర్భంగా టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి వివిధ విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు.
బ్రహ్మోత్సవ గరుడ సేవలో వీలైనంత ఎక్కువ మంది భక్తులు వాహన సేవను తిలకించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని వారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, పాలక మండలి సభ్యులు రంగశ్రీ, దివాకర్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అలాగే శ్రీవారి ఆలయంలో శనివారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ- నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా తెల్లవారు జామున 6 గంటలకు శ్రీ కృష్ణస్వామివారిని శ్రీ భూవరహస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అర్చకులు అభిషేకించారు. అనంతరం స్వామివారికి నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించి, ఆస్థానం నిర్వహించారు. తరువాత శ్రీకృష్ణస్వామివారు ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తిరిగి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పారుపత్తేదార్ శ్రీ హిమంతగిరి, అర్చకులు, ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications