టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం: ప్రాధాన్యతలు
తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్‌గా టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద కొద్దిసేపటి కిందటే జరిగిన కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం రంగనాయకులవారి మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. శేషవస్త్రాన్ని బహూకరించారు.
ఈ సందర్భంగా ముద్దాడ రవిచంద్ర శ్రీవారి ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. తన ప్రాధాన్యతలను వివరించారు. ప్రస్తుతం టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా, మెరుగైన రీతిలో కొనసాగించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులు తమ మనసును పూర్తిగా స్వామివారిపై లగ్నం చేసేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను టీటీడీ కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు.

భక్తులకు అన్ని విధాలా మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని ముద్దాడ రవిచంద్ర చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ ఆధీనంలో దేశవ్యాప్తంగా ఉన్న ఇతర 64 ఆలయాల్లోనూ భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని పేర్కొన్నారు. టీటీడీ నిర్వహిస్తోన్న విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని అన్నారు.
టీటీడీ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా, సేవాభావం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తామని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారిస్తామని రవిచంద్ర వివరించారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఆధునిక వైద్య సదుపాయాలతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
భక్తులకు సౌకర్యాలు, ఆధ్యాత్మిక సేవలతో పాటు విద్య, వైద్య రంగాల్లోనూ మరింత విస్తృతంగా సేవలందించడమే తన ప్రధాన లక్ష్యమని ముద్దాడ రవిచంద్ర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో ప్రభల గోపీనాథ్, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.













Click it and Unblock the Notifications
