TTD: శ్రీవారి భక్తులకు బిగ్ రిలీఫ్ - వసతి, క్యూ లైన్ కష్టాలకు చెక్..ఇక నుంచి...!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో భక్తుల సౌకర్యాల పెంపు దిశగా టీటీడీ పాలక మండలి తాజాగా నిర్ణయాలు తీసుకుంటోంది. డిసెంబర్ నెలఖారులో రానున్న వైకుంఠ ఏకాదశి ఇప్పటి వరకు నిర్వహిస్తున్న విధంగానే తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం పది రోజులు కొనసాగించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో గదుల విషయంలోనూ.. భక్తుల క్యూ లైన్ల పైనా టీటీడీ తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది.
భక్తులకు గదుల విషయంలో టీటీడీ బోర్డు సమావేశంలో చర్చ జరిగింది. తిరుమలలో గదుల టారీఫ్ లను పరిశీలించి నివేదిక సమర్పించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. అదే విధంగా జీఎస్టీ తగ్గింపు ద్వారా భక్తుల పై భారం తగ్గనుంది. అదే విధంగా ఇక నుంచి శ్రీవారి సమయ నిర్దేశిత దర్శన టోకెన్లు (ఎస్‌ఎస్‌డీ) కలిగిన భక్తులు తిరుమలలో పడుతున్న ఇక్కట్లను తొలగించేలా టీటీడీ ధర్మకర్తల మండలి తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతిలో ప్రతిరోజూ దాదాపు 12 వేల నుంచి 16 వేల వరకు ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేస్తారు. వీటిని పొందిన భక్తులు తిరుమలకు వచ్చాక స్థానిక ఎంబీసీ ప్రాంతంలోని ఏటీజీహెచ్ అతిథి గృహం సమీపంలోని ప్రవేశమార్గం నుంచి క్యూలైన్‌లోకి వెళ్లాలి. ఈ ప్రాంతం ఇరుగ్గా ఉండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని విస్తరించాలని బోర్డు నిర్ణయించింది.

అందులో భాగంగా ఇక్కడ నూతనంగా నాలుగు వేల మంది భక్తులు కూర్చునేలా నూతన షెడ్, క్యూలైన్ల ప్రవేశమార్గాన్ని నిర్మించ నున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా భక్తులు ఎండ, వర్షానికి ఇబ్బంది పడకుండా షెడ్లలో సేద తీరుతూ క్యూలైన్ లోకి వెళ్లేందుకు మార్గం సుగమం కానుంది. ప్రస్తుతం సర్వదర్శనం శాశ్వత క్యూలైన్లు రింగు రోడ్డులో కృష్ణతేజ నుంచి బాటగంగమ్మ ఆలయం వరకు మాత్రమే ఉన్నాయి. కొంతకాలంగా వారాంతంలో భక్తుల రద్దీ పెరగడంతో గోగర్భం డ్యామ్ కూడలి వరకు భక్తులు వేచి ఉంటున్నారు. ఆ నేపథ్యంలో బాటగంగమ్మ ఆలయం నుంచి గోగర్భం జలాశయం కూడలి వరకు సుమారు మూడు కి.మీ. మేర రూ.12 కోట్లతో శాశ్వత క్యూలైన్లు, రూ.5.60 కోట్లతో మరుగుదొడ్లు, భక్తులు సేదదీరేందుకు విశ్రాంతి షెడ్లు నిర్మించేందుకు నిర్ణయించారు. కాగా.. శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా 5 వేల ఆలయాలు నిర్మించడానికి టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications