తిరుమలలో చూసి తీరాల్సిన విశ్వావసు నామ ఉగాది వేడుకలు
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 65,487 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,909 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.75 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 22 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

ఈ నెల 30వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది పండగ. శ్రీ విశ్వావసు నామ ఉగాది పండగను అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు. అదే రోజున వేలాదిమంది భక్తుల సమక్షంలో శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు.
ఉగాది పండగను అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు. వేలాది మంది భక్తుల సమక్షంలో శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం జరుగుతుంది. ఉగాది రోజున ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా మలయప్పస్వామివారు ఆలయంలోనికి ప్రవేశిస్తారు.
అనంతరం శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. ఆ తరువాత పంచాగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. టీటీడీ ఆగమ పండితులు, అర్చకులు శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వద్ద శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు.
ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఈ నెల 25వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరుగనుంది. ఆ రోజున ఆలయాన్ని శుద్ధి చేస్తారు అర్చకులు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి.. తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు.
ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేస్తారు. సంవత్సరంలో నాలుగుసార్లు అంటే- ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.












Click it and Unblock the Notifications