తిరుమలలో అయిదు రోజుల ఉత్సవాలు
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 89,161 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 36,450మంది తలనీలాలను సమర్పించారు. స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.77 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
సర్వదర్శనం టోకెన్లను పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 16 గంటల సమయం పట్టింది. 31 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచివున్నరు. వారికి అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. రద్దీకి అనుగుణంగా అదనపు సిబ్బంది సేవలను వినియోగించుకున్నారు.

కాగా- జూన్‌లో హనుమాన్ జయంతి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు. తిరుమలలోని ఆకాశగంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయంలో ఈ వేడుకలు జరుగనున్నాయి. జూన్ 1వ తేదీన వైభవంగా ఆరంభమౌతాయి. 5వ తేదీ వరకు కొనసాగుతాయి.
అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో హనుమాన్ జయంతిని వేడుకలను నిర్వహించనున్నారు అధికారులు. ఈ అయిదు రోజుల పాటు ఆకాశ గంగలో శ్రీ బాలాంజనేయ స్వామి, శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకం, జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహిస్తారు.
ఆకాశ గంగలోని శ్రీ అంజనాదేవి- శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో ప్రతి రోజూ ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు అభిషేక కార్యక్రమాన్ని చేపడుతారు. మొదటి రోజు జూన్ 1న మల్లెపూలు, 2న తమలపాకులు, 3న ఎర్ర గన్నేరు, కనకాంబరం, జూన్ 4న చామంతి పూలతో అంజనాదేవి, బాలాంజనేయ స్వామివారిని అభిషేకిస్తారు. చివరి రోజైన 5వ తేదీన సింధూరంతో అభిషేకం చేస్తారు.
ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య జపాలిలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం నిర్వహిస్తారు. జూన్ 1న హరికథ, 2న అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో సంకీర్తనలు, 3న పురంధర దాస సంకీర్తనలు, 4న హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యలో భజన, 5న హరికథా గానం ఉంటుంది.
ఇందులో భాగంగా జూన్ 1వ తేదీన శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామివారికి తిరుమంజనం కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. హనుమంతుని జన్మ విశేషాలు, ఇతర అంశాలను ఆధ్యాత్మికపరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలో భక్తులకు వివరించేలా ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఉంటాయి.












Click it and Unblock the Notifications