గరుడసేవకు వర్షం పడే ఛాన్స్: టీటీడీ పక్కా ప్లాన్
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తబృందాల చెక్కభజనలు, జీయ్యంగార్ల గోష్టి, మంగళవాయిద్యాల మధ్య వాహనసేవ అంగరంగ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు.
నేడు.. అయిదో రోజు. స్వామివారు గరుడ వాహనంపై ఊరేగనున్నారు. అత్యంత విశిష్టమైన గరుడసేవను సమష్టి కృషితో విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సూచించారు. స్వామివారిపై అపార విశ్వాసంతో తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సంతృప్తికర దర్శనం, వాహనసేవను కల్పించడమే ప్రతి ఉద్యోగి ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. ప్రతి భక్తుడికి దర్శన భాగ్యాన్ని కల్పించేలా చూడాలని అన్నారు.

గరుడసేవ విధుల కోసం ప్రత్యేకంగా నియమించిన సిబ్బందితో తిరుమలలోని ఆస్థాన మండపంలో ఆయన సమావేశం అయ్యారు. వారిని ఉద్దేశించి మాట్లాడారు. టీటీడీ ఉద్యోగులు, విజిలెన్స్, పోలీస్, జిల్లా యంత్రాంగం సమన్వయంతో మరింత ఉత్సాహంగా, అంకితభావంతో పనిచేసి గరుడసేవను విజయవంతం చేయాలని అన్నారు. వర్ష సూచనలు చేసిన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వర్షం వల్ల ఎదురయ్యే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అదనపు ఈవో పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని అభిప్రాయపడ్డారు. శాఖల వారీగా ఉన్నతాధికారులకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వర్తించాలని, ప్రతి ఒక్కరూ పూర్తి సామర్థ్యంతో పనిచేసి భక్తుల సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
గరుడసేవకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు సౌకర్యవంతమైన దర్శన అనుభవాన్ని అందించి టీటీడీ ప్రతిష్ఠను మరింత పెంపొందించాలని అన్నారు. ఈ సమావేశంలో జేఈవోలు డాక్టర్ శరత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొన్నారు.













Click it and Unblock the Notifications
