అనంత్ అంబానీ పెళ్లిలో ఏపీ యూట్యూబర్ అత్యుత్సాహం: హల్‌చల్
Chandrababu Naidu: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ- నీతా అంబానీ తనయుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ రిసెప్షన్ శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం.. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఘనంగా ముగిసింది.
నూతన వధూవరులను ఆశీర్వదించడానికి దేశ, విదేశాల నుంచి రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలు, క్రికెటర్లు దీనికి హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఈ శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ముఖేష్ అంబానీ- నీతా అంబానీ వారికి ఘనస్వాగతం పలికారు. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరికొందరు సహచర మంత్రులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అదే సమయంలో ఏపీకి చెందిన ఓ యూట్యూబర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. ఎలాంటి అనుమతులు, ఆహ్వానం లేనప్పటికీ.. జియో వరల్డ్ సెంటర్‌లో ప్రవేశించగలిగాడు. అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహానికి హాజరయ్యాడు. ముంబై విరార్‌కు చెందిన మరో వ్యక్తి కూడా అక్రమంగా ప్రవేశించాడు. వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేశారు.
ఏపీకి చెందిన ఆ యూట్యూబర్ పేరు ఆలూరి వెంకటేష్. వయస్సు 26 సంవత్సరాలు. అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి రోజైన శుక్రవారం నాడు ఉదయం జియో వరల్డ్ సెంటర్ గేట్ నంబర్ 23 గుండా లోనికి వెళ్లడానికి ప్రయత్నించాడు. అతని వద్ద వెడ్డింగ్ కార్డ్ గానీ, లోనికి వెళ్లడానికి కావాల్సిన పాస్ గానీ లేకపోవడంతో సిబ్బంది వెనక్కి పంపించారు.
ఆ తరువాత అతను గేట్ 19 గుండా జియో వరల్డ్ సెంటర్‌లోకి వెళ్లగలిగాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో కొద్దిసేపటి తరువాత అప్రమత్తమైన సిబ్బంది అతన్ని పట్టుకుని, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
తన యూట్యూబ్ ఛానెల్ కోసం కంటెంట్‌ను చిత్రీకరించాలనుకుంటున్నట్లు అతను తన నేరాన్ని అంగీకరించినట్లు బీకేసీ పోలీసులు తెలిపారు. అతనిపై సెక్షన్ 329 కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. విరార్‌కు చెందిన మరో వ్యక్తి మహ్మద్ షఫీ షేఖ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గేట్ నంబర్ 10 ద్వారా అతను అక్రమంగా లోనికి ప్రవేశించినట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications