యూనివర్సల్ హెల్త్ పాలసీ అప్పటి నుండే.. శుభవార్త చెప్పిన చంద్రబాబు!
ఏపీ సీఎం చంద్రబాబు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పైన ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పారు. ఏప్రిల్ 1 2026 నుంచి ఆంధ్రప్రదేశ్లో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలులోకి వస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందించాలని ఆయన అధికారులకు సూచించారు. ఏపీ సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలను ఉచితంగా అందించడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి మాట్లాడారు.
వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు
వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడానికి అదే ప్రధాన కారణమని చెప్పారు. వైద్య కళాశాలల ఏర్పాటులో పిపిపి విధానాన్ని అనుసరించినప్పటికీ, పర్యవేక్షణ బాధ్యత మాత్రం పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. సమీక్షలో వైద్య కళాశాలల నిర్మాణం, కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ వంటి అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు.

సంజీవని ప్రాజెక్ట్ రాష్ట్రానికి గేమ్ చేంజర్
పిపిపి విధానంలో తొలి విడతలో భాగంగా నిర్మించనున్న ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల వైద్య కళాశాలల నిర్మాణ పురోగతిని సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వైద్య కళాశాలలను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న సంజీవిని ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ గా మారుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పై చంద్రబాబు శుభవార్త
వైద్య ఆరోగ్య రంగంలో దేశం మొత్తానికి ఈ ప్రాజెక్టు ఒక దిక్సూచిగా నిలిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు కుప్పంలో ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజారోగ్యం కోసం సీఎం చంద్రబాబు సూచన
ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు వివిధ ఆసుపత్రుల నుంచి 12 లక్షల క్లెయిములు వస్తున్నాయని, దీనికి నెలకు 330 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు. ఇక రాష్ట్రంలో ఏ వ్యాధికి, ఏ ప్రాంతంలో ఎంత వ్యయం అవుతుందో విశ్లేషించాలి అని సూచించిన చంద్రబాబు ప్రజారోగ్య ప్రభుత్వానికి, ప్రజల వ్యక్తిగత వైద్యానికి వ్యయం తగ్గేలా చూడాలి అన్నారు.












Click it and Unblock the Notifications