Vijayasai Reddy: విజయసాయిరెడ్డి కొత్త పార్టీకి ముహుర్తం ఫిక్స్..! డేట్, టైమ్, ప్లేస్..!
ఏపీలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించేందుకు సిద్దమతున్న మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇవాళ దసరా పండుగ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. తన కొత్త రాజకీయ పార్టీ పేరు, ఇతర వివరాల ప్రకటనకు ముహుర్తం ఖరారైందని ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఈ మేరకు పార్టీ ప్రకటన తేదీ, సమయం, వేదిక వివరాలను కూడా సాయిరెడ్డి వెల్లడించారు. దీంతో పాటు రాష్ట్రంలో అధికార, విపక్షాలను యథావిధిగా టార్గెట్ చేశారు.
విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో నవంబర్ 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు విజయసాయిరెడ్డి ఇవాళ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలే అజెండాగా, రెండు పార్టీలు, రెండు కుటుంబాల దోపిడీకి ముగింపు పలికేలా, కుల, మత పిచ్చి రాజకీయాలను తిరస్కరించేలా, రెడ్ బుక్, రప్ప రప్ప ఫ్యాక్షన్ల నుంచి విముక్తి కల్పించేలా, కరువు కాటకాలు, కరెంటు కోతలు లేని ఆంధ్రప్రదేశ్ ను నిర్మించేలా తమ పార్టీ ఉంటుందన్నారు.

అలాగే ప్రతీ ఎకరానికి రెండు పంటలకు నీరు అందించేలా, ప్రతీ ఇంటికీ ఉచిత విద్యుత్ లభించేలా, చదువుల భారం తగ్గించి , 100 శాతం యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పించేలా, పేద, మధ్య తరగతి వర్గాల ఆదాయాలు పెరిగి ఖర్చులు తగ్గించేలా, 80 ఏళ్లుగా నెరవేరని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా, జెన్ జీ నాయకుల తయారీ ఫ్యాక్టరీలా తన కొత్త రాజకీయ పార్టీ ఉంటుందని విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో వెల్లడించారు. మనందరి కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సును కోరుకునే వారందరూ మద్దతు పలకాలని సాయిరెడ్డి ట్వీట్ లో విజ్ఞప్తి చేశారు.














Click it and Unblock the Notifications
