మేయర్ ఎన్నికల్లో కేశినేని నాని మద్దతు ఎవరికి, కీలక మంత్రాంగం..!!
విజయవాడలో మేయర్ ఎన్నిక ఉత్కంఠ పెంచుతోంది. రాజకీయంగా ప్రతిష్ఠాత్మకంగా మారింది. టీడీపీ, వైసీపీతో పాటుగా మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావు బరిలోకి దిగటంతో ఒక్క సారిగా రాజకీయం మారింది. ఏబీ ఇప్పటికే ప్రచారం తీవ్రతరం చేసారు. ప్రభుత్వం పైన విమర్శలు గుప్పి స్తున్నారు. ఇదే సమయంలో మాజీ ఎంపీ కేశినేని నాని మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో.. ఇప్పుడు నాని మద్దతు ఎవరికి దక్కుతుందనేది కీలకంగా మారుతోంది.
విజయవాడ మేయర్ ఎన్నిక పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కూటమి నుంచి జనసేన అభ్యర్దిగా వంగవీటి రాధా.. వైసీపీ నుంచి మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి బరిలో నిలవగా.. స్వతంత్ర అభ్యర్దిగా ఇండియా కూటమి మద్దతు తో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు పోటీ చేస్తున్నారు. ఏబీ బరిలోకి దిగటంతో ఇక్కడ ఒక్క సారిగా రాజకీయం మారింది. ప్రచారంలో నూ ఏబీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ సమయంలోనే మాజీ ఎంపీ కేశినేని నాని మద్దతు పైన చర్చ మొదలైంది. నాని రాజకీయాలకు దూరంగా ఉంటున్నా ఆయనకు మద్దతు వర్గం ఉంది. నగరంలో ఇప్పుడు జరుగుతున్న పోరులో ప్రతీ ఓటు కీలకంగా మారుతోంది. ఈ క్రమంలో నాని తాను గతంలో పని చేసిన వైసీపీకి మద్దతుగా నిలుస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే నానితో వైసీపీ నేతలు చర్చలు చేసినట్లు తెలుస్తోంది.

కేశినేని నానితో చర్చలు
కాగా.. జనసేన నుంచి బరిలో ఉన్న వంగవీటి రాధా సైతం నానితో సమావేశం అయ్యేందుకు ప్రయత్నించగా.. తాను కలుస్తానని సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు. అదే విధంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ ఆలూరి బాల వెంకటేశ్వరరావు కూడా కేశినేని మద్దతు కోరుతున్నట్లు సమాచారం. వెంకటేశ్వరరావు కేశినేని కుటుంబానికి దూరపు బంధువుగా చెబుతున్నారు. ఇక దశలో కేశినేని నాని కుమార్తెను మేయర్ గా పోటీ చేయించాలని వైసీపీ ఆలోచన చేసింది. అందుకు నాని అంగీకరించ లేదని సమాచారం. విజయవాడలోని పారిశ్రామిక వర్గాలు, కమ్మ సహా.. బీసీ సామాజిక వర్గాల్లో కేశినేనికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ఓటు బ్యాంకును కాపాడుకున్నారు. అదేసమయంలో సానుభూతి కూడా ఉండటంతో ఇప్పుడు నాని ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications
