నకిలీ మద్యం కేసు.. ప్రధాన నిందితుడితో జోగి రమేశ్.. ఫోటోలు వైరల్..!
నకిలీ మద్యం కేసులో ఏ-1 నిందితుడుగా ఉన్న జనార్ధన్ రావు, అతని సోదరుడు జగన్ మోహన్ రావుతో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ ఉన్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఓ వేడుకలో వీళ్లు పక్కపక్కనే కూర్చుని ఉన్నారు. అయితే ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో తనకు జనార్ధన్ రావు ఎవరో తెలియదని జనార్ధన్ రావుతో సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని జోగి రమేశ్ చెప్పిన విషయం తెలిసిందే. తాను లై డిటెక్టర్ టెస్ట్ కు కూడా సిద్ధమని చెప్పారు. కాగా తాజాగా కేసులో ఏ-1 నిందితుడుగా ఉన్న జనార్ధన్ రావు, అతని సోదరుడు జగన్ మోహన్ రావుతో జోగి రమేశ్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.

ఏపీలోని అన్నమయ్య జిల్లా ములకలచెరువులో జరిగిన నకిలీ మద్యం కేసులో రోజు రోజుకీ కీలక పరిణామం చోటుచేసుకుంటుంది. మొన్న జనార్ధన్ రావు వాంగ్మూలం, నిన్న వాట్సాప్ చాట్ ఈ కేసులో కీలకంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో ఏ-1 నిందితుడుగా ఉన్న జనార్ధన్ రావు, అతని సోదరుడు జగన్ మోహన్ రావుతో మాజీ మంత్రి జోగి రమేశ్ ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ కు ఉచ్చు మరింత బిగుస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

ఇక ఇటీవల ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్‌రావు వీడియో రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు జోగి రమేశ్ ఆదేశాలతో తంబళ్లపల్లెలో నకిలీ మద్యం తయారీ ప్రారంభమైందని తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకే నకిలీ మద్యం తయారు చేసినట్లు తెలిపాడు. అయితే జోగి రమేశ్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను జనార్ధన్ రావును ఎప్పుడూ కలవలేదని, ఈ వీడియో బలవంతంగా తీయించిందని అన్నారు. తనకు జనార్ధన్ రావుతో సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని జోగి రమేశ్ పేర్కొన్నారు.

ఆ తర్వాత ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేశ్ నిందితుడు జనార్ధన్ రావుతో చాటింగ్ చేసినట్టు ఒక స్క్రీన్ షాట్ వైరల్ గా మారింది. అయితే దీనిపై జోగి రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక తాజాగా నకిలీ మద్యం కేసులో ఏ-1 నిందితుడుగా ఉన్న జనార్ధన్ రావు, అతని సోదరుడు జగన్ మోహన్ రావుతో జోగి రమేశ్ ఉన్న ఫొటోలు వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications