ఎన్నికల నాటికి నెమ్మదిగా జారుకోబోతున్న ఎమ్మెల్యే?
ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు రాలేదనే ఆగ్రహంతో ఉన్న ఆ ఎమ్మెల్యే బహిరంగసభలోనే నేరుగా విమర్శలు గుప్పించారు.
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు వచ్చే ఎన్నికల నాటికి నెమ్మదిగా పార్టీ నుంచి జారుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కు సాధ్యమైనంత దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే వైఖరి వైసీపీలో హాట్ టాపిక్ గామారింది. ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారంటూ మంత్రులతో సహా అందరూ బిక్కు బిక్కుమంటూ వెళుతున్నారు. కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు.

బహిరంగసభలోనే నేరుగా విమర్శలు
ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు రాలేదనే ఆగ్రహంతో ఉన్న ఆ ఎమ్మెల్యే బహిరంగసభలోనే నేరుగా విమర్శలు గుప్పించారు. తాజాగా ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షకు డుమ్మా కొట్టడంతో అది తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆ ఎమ్మెల్యే అప్పటి ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో 30వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల్లో గెలవడానికి తనకు సహకరించిన కీలక నేత వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో పార్టీ శ్రేణులు సంబంధిత నియోజకవర్గంలో రెండుగా విడిపోయాయి.

షాడో ఎమ్మెల్యేగా తమ్ముడు?
తన సొంత మనుషుల్ని మండలానికి ఒకరిని ఇన్ ఛార్జిగా నియమించుకున్నారు. అంతేకాకుండా తమ్ముడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారంటూ సొంత పార్టీ నేతలే విమర్శలు ఎక్కపెడుతుంటారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ ఆ ఎమ్మెల్యేకు ఫుల్లుగా క్లాస్ పీకారు. గత ఎన్నికల్లో తాను గెలవడానికి సహకరించిన కీలక నేతకు ఖ్యమంత్రి ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తుండటంతో సదరు ఎమ్మెల్యే కినుక వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నారు. వెనకబడిన ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నారంటూ జగన్ హెచ్చరిస్తున్నప్పటికీ వాటిని పెడచెవిన పెడుతున్నారు.

ఎన్నికల సమయానికే స్పష్టత
గతేడాది జరిగిన పార్టీ ప్లీనరీలో ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ పార్టీ నేతల చెవుల్లో వినపడుతూనే ఉంటాయి. గడప గడపకు వెళ్లాలంటే గ్రామాల్లో నాలుగు పనులు చేయాలని, చేసిన పనులకు బిల్లులు ఇవ్వడంలేదంటూ లోపాలను ఎత్తిచూపారు. నవరత్నాలు పేరుతో బటన్ నొక్కితే గ్రాఫ్ ఆయనకే పెరుగుతుందికానీ ఎమ్మెల్యేలకు పెరగడంలేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. తర్వాత జరిగిన సమీక్షా సమావేశానికి కూడా హాజరు కాలేదు. పార్టీలో సదరు ఎమ్మెల్యే వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆయన టీడీపీ వైపు చూస్తున్నారని కొందరు, జనసేన వైపు చూస్తున్నారంటూ మరికొందరు చెబుతున్నారు. ఎటువైపు చూస్తున్నారనేది ఎన్నికల సమయానికి కానీ ఒక స్పష్టత వచ్చేలా లేదు.












Click it and Unblock the Notifications