చంద్రబాబుకు ముద్దు పెట్టేందుకు మహిళ యత్నం (వీడియో)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఊహించని పరిణామం ఎదురైంది. సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లా పరవాడలో పర్యటించారు. ఆ జిల్లాలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ముద్దు పెట్టేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. అయితే, ఆయన సున్నితంగా తిరస్కరించారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జడ్ ప్లస్ భద్రతలో ఉండే సీఎం దగ్గరకు వెళ్లడమంటే మామూలు విషయం కాదు. కానీ, ఓ మహిళా అభిమాని మాత్రం ఎలాగైనా తమ అభిమాన నేత చంద్రబాబును కలవాలనుకుని దృఢంగా నిశ్చయించుకుంది.

ఈ క్రమంలో అనకాపల్లి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు చుట్టూ ఉన్న సెక్యూరిటీని తప్పించుకుని సీఎం వద్దకు వెళ్లారు.
ఆమె అభిమానాన్ని చూసి చంద్రబాబు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. తొలుత సీఎం భద్రతా సిబ్బంది మహిళను వారించే ప్రయత్నం చేసినా.. చంద్రబాబు మాత్రం ఆ మహిళను దగ్గరకు తీసుకొని అప్యాయంగా పలకరించారు. ఆమె తమ అభిమాన నేతకు ఎంతో ఆనందంగా పుష్ఫగుచ్చాన్ని అందించింది.
అయితే ఆమె అంతటితో ఆగకుడా.. చంద్రబాబును పట్టుకుని ఆయనకు ముద్దు పెట్టే ప్రయత్నం చేసింది. ఇలా రెండు మూడు సార్లు ప్రయత్నం చేసింది. అయినప్పటికీ చంద్రబాబు సున్నితంగా తిరస్కరించి, ముందుకు సాగారు. ఈ ఘటన అక్కడ చర్చనీయాంశంగా మారింది.
కాగా, అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం వెన్నెలపాలెంలో రోడ్లకు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. సంక్రాంతిలోపు రాష్ట్రంలోని అన్ని రోడ్లపై గుంతలను పూడ్చివేయాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రోడ్లు నాగరికతకు చిహ్నమని, అలాంటి రోడ్లను గత పాలకులు నరకానికి దారులుగా మార్చారని వైసీపీపై ధ్వజమెత్తారు. వారు మిగిల్చిన ఈ విధ్వంసాన్ని పూడ్చే బాధ్యతను తాము తీసుకున్నట్లు వివరించారు. వచ్చే సంక్రాంతి పండుగ నాటికి గుంతల్లేని రోడ్లుగా అభివృద్ధి చేసి తీరతామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications