వైసీపీని ఇరికిద్దామనుకుంటే.. కూటమి నేతలు ఇరుక్కుపోతున్నారే..!
పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవలే ఓ తెలుగు నటి వెల్లడించారు. తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో ఉన్న లైంగిక వేధింపులు గురించి హేమా కమిషన్ షాకింగ్ విషయాలను వెల్లడించింది.
హేమ కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలను బట్టబయలు చేసింది. మలయాళ సినిమా నేరస్థులచే నడపబడుతుందని మరియు పరిశ్రమలో విస్తృతంగా లైంగిక దోపిడీ జరుగుతోందని నివేదిక పేర్కొంది. ఇక రాజకీయ నేతల నుంచి కూడా మహిళా ఆర్టిస్టులకు వేధింపులు తప్పడం లేదు. నటి కాదంబరీ జెత్వానీ గత వైసీపీ ప్రభుత్వం వేధించిందనే విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ నటి ఇచ్చిన ఫిర్యాదుపై ఏపీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో వైసీపీ ముఖ్య నేతలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ ఘటన మరువక ముందే టీడీపీ నేత వ్యవహరం బయటకు వచ్చింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలైన వరలక్ష్మీ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం బయటకు రావడంతో కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీపై కూడా లైంగికంగా వేధించారని ఓ మహిళ పోలీసుకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్లిన సమయంలో జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తెలిపింది. హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చి కూడా ఆయన పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. జానీ మాస్టర్ జనసేనలో యాక్టివ్‌గా ఉండటంతో ఈ ఇష్యూ పొలిటికల్‌గా కూడా టర్న్ తీసుకుంది. దీంతో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. నటి కాదంబరీ జెత్వానీని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులకు ఇరికిద్దామనుకుంటే.. కూటమి నేతలే ఇరుక్కుపోతున్నారని వైసీపీ నాయకులు ఎద్దెవా చేస్తున్నారు. మరి జానీ మాస్టర్ కేసుపై ఆ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications