అప్పుడే కేసు తేలుతుంది - అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి : వైయస్ భాస్కర్ రెడ్డి..!!
సీబీఐ పిలుపుతో వైఎస్ భాస్కర రెడ్డి విచారణకు హాజరయ్యేందుకు వెళ్లారు. కీలక వ్యాఖ్యలు చేసారు.
సీబీఐ పిలుపుతో వైఎస్ భాస్కర రెడ్డి విచారణకు హాజరయ్యేందుకు వెళ్లారు. వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర రెడ్డిని సీబీఐ గత ఏడాది రెండు రోజుల విచారించింది. సుదీర్ఘ విరామం తరువాత తిరిగి ఈ నెల ఆరో తేదీన విచారణకు రావాలని సీబీఐ తొలుత భాస్కర రెడ్డికి నోటీసులు ఇచ్చింది. తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో ఆ రోజున రాలేనని భాస్కర రెడ్డి సీబీఐకి లేఖ రాసారు. దీంతో..ఈ రోజు కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో విచారణకు రావాలని సూచించింది. సీబీఐ సూచించిన ప్రకారం భాస్క రెడ్డి జైలు ప్రాంగణం వద్దకు వెళ్లారు. కీలక వ్యాఖ్యలు చేసారు.
వివేకా హత్య కేసులో ఇప్పటికే సీబీఐ ఒక సారి భాస్కర రెడ్డి..మూడు సార్లు ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారించింది. ఈ నెల 13న హైదరాబాద్ లో సీబీఐ ముందు అవినాశ్ మూడో సారి హాజరయ్యారు. అదే సమయంలో ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సోమవారం వరకు అవినాశ్ ను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలిచ్చిన తెలంగాణ హైకోర్టు మంగళవారానికి కేసు వాయిదా వేసింది.
ఇదే సమయంలో ఈ రోజు భాస్కర రెడ్డి సీబీఐ విచారణ కోసం కడప జైలుకు వెళ్లారు. అయితే, విచారణ అధికారులు లేకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అవినాశ్ రెడ్డి అన్ని విషయాలు చెప్పారని..తాను చెప్పేది ఏం లేదని వివరించారు.

తనకు ఆరోగ్యం బాగా లేకపోయినా..విచారణకు సహకరించాలనే ఉద్దేశంతో వచ్చానని భాస్కర రెడ్డి చెప్పారు. విచారణ అధికారులు అందుబాటులో లేరని..మరోసారి నోటీసులు ఇస్తామని చెప్పారన్నారు. తిరిగి తనకు నోటీసులు ఇస్తే విచారణకు వస్తానని స్పష్టం చేసారు. ఈ కేసు పరిష్కారం కావాలంటే కీలకమైన ఆ లేఖ బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఆ లెటర్ బయటకు వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో తాను ఇంత కంటే ఏమీ చెప్పలేనని వ్యాఖ్యానించారు. అరెస్ట్ పైన జరుగుతున్న ప్రచారం పైనా భాస్కర రెడ్డి స్పందించారు. కేసు తప్పు దోవ పట్టిస్తున్నారని చెబుతూ..అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అంటూ అసహనం వ్యక్తం చేసారు. తాను అన్నింటికీ సిద్దమేని భాస్కర రెడ్డి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications