పోలింగ్ రోజు పులివెందులలో జగన్ హంగామా..! ఆంక్షలున్నా రోడ్ షో, ధర్నాలు..!
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) పోలింగ్ రోజు పులివెందులలో హంగామా చేస్తున్నారు. ఎన్నికల కోడ్ తో పాటు పోలింగ్ రోజు ఆంక్షలు సైతం అమల్లో ఉన్నా లెక్కచేయకుండా పులివెందులలో ఉదయం నుంచీ ఉల్లంఘనలకు దిగుతున్నారు. అధికారులతో సమన్వయం చేసుకుని ఓటు వేసేందుకు వచ్చి, సైలెంట్ గా వెళ్లిపోకుండా రోడ్ షోలు నిర్వహించడం, ధర్నాలు చేపట్టడం చేస్తున్నారు. దీంతో కూటమి నేతలు ఆయనపై మండిపడుతున్నారు. జగన్ పై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్నారు.
పులివెందులలో జగన్ ల్యాండ్ కాక ముందే వైసీపీ నేతలు ఉదయం నుంచే హైడ్రామా సృష్టించారు. జగన్ హెలీకాప్టర్ మామూలుగా ల్యాండైనా... ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటూ ప్రచారం ప్రారంభించారు. తద్వారా పులివెందులలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్లాన్ చేసినట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ హెలికాఫ్టర్ ల్యాండ్ కాగానే అసలు రచ్చ మొదలైంది. పులివెందులలో పోలింగ్ జరుగుతున్న సమయంలోనే నిబంధనలకు విరుద్దంగా రోడ్లపై జగన్ కార్ల కాన్వాయ్ తో ర్యాలీగా వెళ్లారు. అలాగే మధ్యలో రోడ్ షో తరహాలో ప్రజలతో మాట్లాడారు. పులివెందులలో ఎన్నిక సమయంలో జగన్ చేస్తోంది రోడ్ షో కాదు, ఫ్యాక్షన్ షో అంటూ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పులివెందులలో తొలి సారి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతూ, రౌడీరాజకీయాలకు చెక్ పడుతుండడంతో వైసీపీ కుట్రల మీద కుట్రలు చేస్తోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. నామినేషన్ల నాటి నుంచే మొదలైన హింసాత్మక ఘటనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్తున్నారు. పలు చోట్ల పోటీకి కూడా వైసీపీ నేతలు ఆసక్తి చూపకపోవడంతో తాను పులివెందుల వస్తున్నట్లు చెప్పి క్యాడర్ ను జగన్ రెచ్చగొట్టారని, చొక్కాలు మడతపెడతా అంటూ హింసకు వైసీపీ శ్రేణులకు పురిగొల్పారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
ఇవాళ పులివెందులలో పోలింగ్ రోజు అయినా వాహనాలు తగులబెట్టి కొత్త డ్రామాకు తెరదీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారే హింసకు దిగి వారే ప్రత్యర్థులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. హెలికాఫ్టర్ దిగనివ్వలేదు అంటూ తప్పుడు ప్రచారం కూడా మొదలుపెట్టారని, అసలు చెప్పిన సమయాని కంటే ముందు వచ్చి అనుమతి ఇవ్వలేదు అంటూ డ్రామా చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకపోయినా భారీ వాహనాలతో పులివెందులలో ర్యాలీ నిర్వహించడం,
ఓ పక్క అడ్డుకుంటున్నారు అంటూ మరో పక్క చిరు నవ్వులతో క్యాడర్ కు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారం చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. కొన్ని చోట్ల ఏజెంట్లను బయటకు పిలిపించుకుని తమ వారిని రానివ్వలేదు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి సైతం రోడ్డెక్కడంతో.. దాన్ని టీడీపీకి ఆపాదించి గగ్గోలు పెడుతున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. ఏ అభ్యర్థిపైనా, ఏ ఏజెంట్ పైనా దాడి జరగలేదని అధికారులు ఇప్పటికే తేల్చిచెప్పడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. ప్రశాంతంగా పోలింగ్ జరిగితే తమ ఉనికి గల్లంతు అవుతుందని హింసకు దిగేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. తనకు సంబంధం లేకపోయినా ఆర్వో కార్యాలయానికి ఏజెంట్లతో వెళతానని జగన్ చేసిన ప్రకటన.. అనంతరం ఆర్వో ఆఫీసుకు వెళ్లడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. హింసకు దిగిన వాళ్లు వైసీపీ కార్యకర్తలు అని వీడియోల ద్వారా ఇప్పటికే గుర్తించిన పోలీసులు.. వారిపై కేసుల నమోదుకు సిద్దమవుతున్నారు. మరోవైపు పులివెందులలో జగన్, వైసీపీ కార్యకర్తల ఆంక్షల ఉల్లంఘనపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసేందుకు కూటమి నేతలు సిద్దమవుతున్నారు.














Click it and Unblock the Notifications
