నేడు కీలక ప్రకటన చేయనున్న జగన్?
YS Jagan Mohan Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత చోటుచేసుకుంటోన్న హత్యలు, అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా దేశ రాజధాని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైంది.
చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, దాడులపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ నిర్వహించిన ఆందోళనలకు జాతీయ స్థాయి ప్రతిపక్షాల నుంచి మంచి స్పందన లభించింది. వివిధ జాతీయ పార్టీల నాయకులు, అధికార ప్రతినిధులు, లోక్‌సభ సభ్యులు దీనికి హాజరయ్యారు.

సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) నాయకుడు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ నేత నదీముల్‌హక్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఏడీఎంకే, ఇండియన్ ముస్లిం లీగ్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారు.
ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా నుంచి అనూహ్యంగా మద్దతు లభించింది. ఈ కూటమిలో దాదాపు అన్ని భాగస్వామ్య పక్షాల నాయకులు, ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. చంద్రబాబు- పవన్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఈ ఆందోళన విజయవంతం కావడం వైఎస్ఆర్సీపీ క్యాడర్‌లో జోష్ పెరిగింది.
ఈ క్రమంలో వైఎస్ జగన్.. నేడు మీడియా ముందుకు రాబోతోన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు. తాడేపల్లిలోకి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటైంది. అయిదు సంవత్సరాల తమ ప్రభుత్వ హయాంలో వివిధ శాఖలు, విభాగాల్లో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ చంద్రబాబు ఇటీవలే విడుదల చేసిన శ్వేతపత్రాలపై కౌంటర్ అటాక్‌కు దిగనున్నారు జగన్.
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్, శాంతి భద్రతలు, ప్రభుత్వం చేసిన అప్పులపై సమగ్రంగా వివరణ ఇవ్వనున్నారాయన. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించనున్నారు. 2014- 2019 మధ్యకాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు పాలన, 2019- 2024 మధ్య కొనసాగిన తన ప్రభుత్వ పనితీరును అంశాలవారీగా స్పష్టతను ఇవ్వనున్నారు.
జాతీయ మీడియానూ ఆహ్వానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మీడియా సమావేశంలో జగన్ కొన్ని కీలక ప్రకటనలు చేస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇండియా కూటమిలో చేరడమా? లేక బయటి నుంచి మద్దతు ఇవ్వడమా? అనే విషయంపై జగన్ ఓ క్లారిటీ ఇస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications