లిక్కర్ కేసులో జగన్ సోదరుడు - సిట్ చేతికి కీలక ఆధారాలు..!!
లిక్కర్ కేసు విచారణలో కీలక సమాచారం బయటకు వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పలువురి ప్రమేయం గురించి వివరించింది. జగన్ గురించి ప్రస్తావన చేసింది. ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన సిట్.. మరొకటి దాఖలు చేసేందుకు సిద్దం అవుతోంది. ఇదే సమయంలో జగన్ సోదరుడు అనిల్ రెడ్డి పాత్ర పైన సిట్ కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.
మద్యం కుంభకోణం కేసులో వైఎస్ జగన్ సోదరుడైన వైఎస్ అనిల్‌రెడ్డి (జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి రెండో కుమారుడు) ప్రమేయం, పాత్రపై సిట్‌కు కీలక ఆధారాలు లభ్యం అయినట్లు తెలుస్తోంది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి ప్రతినెలా రూ.50-60 కోట్ల మేర ముడుపులు వసూలు వ్యవహారంలో అనిల్ రెడ్డి పాత్ర పైన సిట్ సమాచారం సేకరించింది. రిమాండ్ రిపోర్టుల్లోనూ సిట్ ఈ అంశాన్ని ప్రస్తావించింది. దీంతో, సిట్ అధికారులు కెసిరెడ్డి నుంచి అనిల్‌రెడ్డికి ముడుపుల సొమ్ము ఎలా చేరిందనేది ఆరా తీస్తున్నారు. అదే సమయంలో ఈ సొమ్ము ఎవరెవరి ద్వారా వెళ్లింది? అక్కడి నుంచి ఎక్కడెక్కడికి తరలింది? అంతిమంగా ఎక్కడికి చేరింది? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

సిట్ ఈ వ్యవహారంలో అనిల్‌రెడ్డి పీఏ దేవరాజు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించింది. ఈ కేసు నిందితులందరితోనూ అతను నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు తేల్చింది. మూడు రోజులుగా సిట్ అధికారులు దేవరాజును విచారిస్తున్నారు. తనకేమీ తెలియదని, కేసుతో సంబంధం లేదని ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. తాము సేకరించిన సాంకేతిక ఆధారాలు చూపించి సిట్ అధికారులు ప్రశ్నించటంతో అతను నీళ్లు నమిలినట్లు సమాచారం. దేవరాజు వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. అనిల్‌రెడ్డి జగన్‌కు వరుసకు సోదరుడు మాత్రమే కాదు అత్యంత సన్నిహితుడు కూడా. అనిల్ చెన్నైలో నివసిస్తుంటారు. జగన్ తరఫున వివిధ ఆర్థిక వ్యవహారాలు చక్కబెడుతుంటారనే ప్రచారం. జేసీకేసీ, ప్రతిమ సంస్థలను ముందుపెట్టి ఆయనే ఇసుక దందా నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో.. అనిల్ పాత్ర పైన సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications