విషపునాగు జగన్; కాదని ప్రమాణం చెయ్ సాయిరెడ్డి: వైఎస్ షర్మిల!
వైయస్ జగన్ మళ్ళీ సీఎం కాకూడదన్న అజెండాతోనే షర్మిల పని చేస్తున్నారని, ఆమెది అధికారం కోసం తగాదా కానీ ఆస్తి కోసం తగాదా కాదంటూ వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి షర్మిల పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో కలిసి ఆమె కుట్ర చేస్తుందన్నారు. ఇక ఈ క్రమంలో విజయసాయిరెడ్డి పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన షర్మిల సాయి రెడ్డి చదివింది జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా అంటూ ప్రశ్నించారు.
జగన్ మోచేతి నీళ్ళు తాగినవారే కదా : వైఎస్ షర్మిల
ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న వైయస్సార్ మ్యాన్డేట్ అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా అంటూ ప్రశ్నించారు. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగిన వాళ్లేనని, రాజకీయంగా ఆర్థికంగా జగన్ గారి వల్ల బలపడిన వారని, మీరు ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారు అంటూ మండిపడ్డారు.

వైఎస్సార్ మరణంపై అనుమానం ఉంటే ఐదేళ్లు గాడిదలు కాశారా
వైయస్సార్ మరణానికి కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి కారణం కాదని పేర్కొన్న షర్మిల రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని వైయస్సార్ అధికారంలోకి తెచ్చారని బంగారు బాతును ఎవరు చంపుకోరని, సొంత కళ్ళను ఎవరు పొడుచుకోరని వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ మరణానికి చంద్రబాబు కారణమైతే మీరు అధికారంలో ఉండి ఐదేళ్లు గాడిదలు కాసారా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదో చెప్పాలని నిలదీశారు.
జగన్ వలనే చార్జిషీట్ లో వైఎస్సార్ పేరు
దర్యాప్తు చేసి నిజానిజాల నిగ్గు ఎందుకు తేల్చలేదని షర్మిల అడిగారు. దోషులను ఎందుకు శిక్షించలేదు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎందుకు ఒక ఎంక్వయిరీ కూడా వేయలేదు. ఇది మీ చేతగానితనానికి నిదర్శనం కాదా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్సార్ మరణించిన తర్వాత చార్జిషీట్లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అంటూ ప్రశ్నించారు.
అడ్వకేట్ జనరల్ పదవిని పొన్నవోలుకు ఎందుకు ఇచ్చారో
కేసుల నుంచి బయటపడటం కోసం పొన్నవోలు తో కలిసి కుట్ర చేయలేదా అంటూ షర్మిల అడిగారు. ఒకవేళ అలా చేయకపోతే జగన్ గారు సీఎం అయిన వెంటనే మొదటిగా అడ్వకేట్ జనరల్ పదవిని పొన్నవోలుకు ఎందుకు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ తన స్వప్రయోజనాల కోసం తల్లిని కోర్టుకు ఈడ్చిన విషపు నాగు జగన్ గారు కాదా అంటూ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు
మీకు సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి
చంద్రబాబుతో తనకు ఎటువంటి వ్యక్తిగత సంబంధాలు లేవని వైయస్సార్ తన బిడ్డ పెళ్లికి చంద్రబాబు గారిని పిలిచారని, అలాగే నేను కూడా పిలిచానని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే నా చీర గురించి విపరీతార్థాలు తీసే మీలాంటి వాళ్లకు సభ్యత సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి అంటూ ప్రశ్నించారు.
వైఎస్సార్ బిడ్డకు ఆ అవసరం రాదు
చంద్రబాబు కోసం పని చేయాల్సిన అవసరం లేదని, ఆయన బ్రాండింగ్ ను ఫాలో అవ్వడానికో, ఆయన కళ్ళల్లో ఆనందం చూడ్డానికో, ఆయనను ఇంప్రెస్ చేయడానికో వైయస్సార్ బిడ్డకు పని చేయాల్సిన అవసరం లేదని, అలాంటి అవసరం ఎప్పటికీ రాదని మాట ఇస్తున్నానని పేర్కొన్నారు. అయినా జగన్ గారికి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా అంటూ ప్రశ్నించిన వైఎస్ షర్మిల ఇప్పటికి అద్దంలో చూసుకున్న చంద్రబాబు జగన్ కు కనిపిస్తున్నట్టు ఉంది కదా అంటూ సెటైర్లు వేశారు.












Click it and Unblock the Notifications