వైఎస్ వివేకా హత్యకేసులో అనూహ్య మలుపు: ప్రధాన సాక్షి మృతి..!!
YS Viveka murder case: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన సాక్షి ఒకరు మరణించారు. ఫలితంగా- మున్ముందు దీని ఫలితం ఎలా ఉంటుందనేది ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆ సాక్షి పేరు- రంగన్న. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షి. గతంలో వివేకానందరెడ్డి ఇంట్లో వాచ్‌మెన్‌గా పని చేశారు. వృద్ధాప్యం, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందుల వల్ల ఏడెనిమిది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి కిందటే మరణించారు.

రంగన్న స్వస్థలం పులివెందుల. అక్కడ ఉన్నప్పుడే అనారోగ్యానికి గురయ్యారు. గత ఏడాది జులై నుంచి ఆసుపత్రిలో తరచూ చికిత్స తీసుకున్నారు. కొద్దిరోజుల పాటు పులివెందుల ఆసుపత్రిలోనూ అడ్మిట్ అయ్యారు. అయినప్పటికీ- ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడం వల్ల కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.
2019 మార్చిలో సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మాజీ మంత్రి వివేకానందరెడ్డి పులివెందులలోని తన నివాసంలో దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన ఇంటి దగ్గర వాచ్‌మెన్‌గా పని చేశారు. ఆయన ఈ కేసులో ప్రధాన సాక్షిగా మారారు.
ఈ కేసును విచారిస్తోన్న సీబీఐ అధికారులు ఆయన స్టేట్‌మెంట్‌ను సైతం రికార్డు చేశారు అప్పట్లో. అలాగే- రంగన్న తమ వద్ద ప్రస్తావించిన పలు అంశాలను ఛార్జిషీట్‌లో కూడా పొందుపరిచారు సీబీఐ అధికారులు. జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు ఆయన వాంగ్మూలాన్ని అప్పట్లో రికార్డ్ చేశారు. వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి కావడంతో రంగననకు 1+1 భద్రత సైతం కల్పించారు అధికారులు.
వివేకానందరెడ్డి హత్యకేసు- గత ఏడాది ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారిన విషయం తెలిసిందే. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత రెడ్డి- దీనిపై విస్తృతంగా ప్రచారం చేశారు. వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డిలపై ఘాటు ఆరోపణలు సంధించారు అప్పట్లో.
ఎన్నికల తరువాత ఈ కేసు తెరమరుగైంది. ఇప్పుడు తాజాగా రంగన్న మృతితో ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కింది. ప్రధాన సాక్షి రంగన్న మృతి చెందడం.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications