వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ అందర్నీ బాధ పెడుతున్నారా?: ఒక్కో నేతది ఒక్కో కారణం..

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే పన్నెండు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మరో ముగ్గురు నలుగురు వరుసలో ఉన్నారు. అందులో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కూడా ఉన్నారు. ఆయన రేపు సైకిల్ ఎక్కేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.

వైసిపిని వీడుతున్న ఎమ్మెల్యేల్లో చాలామంది పార్టీ అధినేత జగన్ తీరును తప్పుబడుతున్నారు. ఆయన సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వరని, ఆయన చెప్పిందే వేదమని, ఆయన అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గ అభివృద్ధిని కూడా ప్రస్తావిస్తున్నారు.

ఇప్పటి దాకా వైసిపి నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. మరో ముగ్గురు ఈ రెండు రోజుల్లో సైకిల్ ఎక్కనున్నారు. జగన్ పైన ఒక్కో నేత ఒక్కో విమర్శ చేస్తున్నారు. అదే సమయంలో ఒక్కో నేత ఒక్కో వ్యక్తిగత కారణంతోను టిడిపిలో చేరుతున్నారని చెప్పవచ్చు.

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేరిక వెనుక తన బంధువు కేశవ రెడ్డి విద్యా సంస్థల చైర్మన్ కేసు కారణం అనే వాదనలు వినిపించాయి. జలీల్ ఖాన్ వంటి నేతల చేరిక వెనుక.. టిడిపిలో మైనార్టీ ప్రజాప్రతినిధి లేకపోవడంతో... మంత్రి పదవి నేపథ్యంలో వారు చేరారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

జ్యోతుల నెహ్రూ సీనియర్ నేత. ఆయనకు జగన్ ప్రాధాన్యత ఇవ్వలేదనే వాదనలు వినిపించాయి. ఈ కారణంగానే ఆయన దూరం జరిగినట్లుగా భావిస్తున్నారు. భూమా నాగిరెడ్డి కూడా జగన్ పట్ల అసంతృప్తి కారణంగానే పార్టీ వీడినట్లుగా వార్తలు వచ్చాయి.

YSRC Addanki MLA Gottipati to join TDP

ఆదినారాయణ రెడ్డి, జలీల్ ఖాన్, చాంద్ బాషా, భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ.. వంటి సీనియర్ నేతలు కూడా జగన్ పట్ల అసంతృప్తితోనే పార్టీని వీడారు. తాజాగా, గొట్టిపాటి రవి కుమార్ వంటి నేతలు కూడా జగన్ వైఖరితో మనస్తాపం చెందినట్లుగా చెబుతున్నారు. జగన్ వైఖరి వల్లే పలువురు నేతలు టిడిపిని వీడితున్నారని టిడిపి నేతలు కూడా చెబుతున్నారు.

గొట్టి పాటి రవి కుమార్ కూడా సైకిల్ ఎక్కేందుకు కొన్ని కారణాలు ఉన్నాయని అంటున్నారు. గొట్టిపాటి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన.. 2009, 2014లోను గెలుపొందారు.
2009లో టిడిపి సీనియర్ నేత కరణం బలరాంను మట్టి కరిపించారు. 2014 ఎన్నికల్లో కరణం తనయుడు వెంకటేశ్‌ను ఓడించారు. కరణం, గొట్టిపాటి కుటుంబాల మధ్య రాజకీయ వైరం కూడా ఉంది. ఈ క్రమంలో గొట్టిపాటికి టిడిపిలోకి స్వాగతం లభించడం చర్చనీయాంశమవుతోంది.

ఇప్పటిదాకా టిడిపిలో చేరిన వారంతా దాదాపు గతంలో ఆ పార్టీలో పని చేసిన వారే. జ్యోతుల నెహ్రూ, భూమా నాగిరెడ్డి వంటి వారు గతంలో టిడిపిలో పని చేశారు. మిగతా వారు కూడా ఉన్నప్పటికీ.. గొట్టిపాటి రాక మాత్రం మరింత చర్చనీయాంశమవుతోంది. ఆయనకు టిడిపితో ఏమాత్రం సంబంధాలు లేవు.

గొట్టిపాటి 2004లో మార్టూరు నుంచి ఎన్నికయ్యారు. 2009లో అద్దంకికి మారారు. ఆయన కరణం కుటుంబాన్ని ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలో రెండు కుటుంబాల మధ్య ఉన్న వైషమ్యాలు మరింత పెరిగాయి.

ఈ సమయంలోనే ఇటీవల సాగర్ నీటి విషయమై తన నియోజకవర్గ పరిధిలో పర్యటనకు వచ్చిన మంత్రికి వినతి పత్రం అందించేందుకు గొట్టిపాటి తన అనుచర గణంతో తరలివెళ్లారు. ఆ సందర్భంగా గొట్టిపాటి, కరణం వర్గాల మధ్య పెద్ద ఘర్షణే చోటుచేసుకుంది. గొట్టిపాటి కారుపై కరణం వర్గం దాడికి దిగింది.

ఈ దాడిపై కాస్తంత వేగంగా స్పందించిన టిడిపి నేతలు... గొట్టిపాటికి మద్దతుగా నిలిచి, కరణం వర్గం తీరును ప్రశ్నించారు. అదే సమయంలో సొంత పార్టీ అధినేత వైయస్ జగన్ నుంచి గొట్టిపాటికి కనీసం పలకరింపు కూడా లేదని తెలుస్తోంది. దీంతో గొట్టిపాటి బాధపడ్డారని తెలుస్తోంది.

జగన్ తనను పట్టించుకోవడం లేదని, సీనియర్ ఎమ్మెల్యేగా పరిగణించలేకపోయారని భావిస్తున్న ఆయన మరోసారి కూడా పార్టీ అధినేత పట్ల అసంతృప్తికి గురయ్యారని తెలుస్తోంది. గతంలో అద్దంకి నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత ఇంటిలో వివాహానికి హాజరైన జగన్... ఆ విషయాన్ని గొట్టిపాటికి చెప్పలేదట.

దీంతో మరోమారు జగన్ తీరుపై గొట్టిపాటి బాధ పడ్డారని తెలుస్తోంది. ముఖ్యంగా, ప్రకాశం జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కడంలో గొట్టిపాటిదే కీలక పాత్ర.

అయితే తన బాబాయి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి అత్యంత ప్రాధాన్యమిచ్చిన జగన్... జడ్పీలో మెజారిటీకి కారణమైన గొట్టిపాటిని కనీసం భుజం కూడా తట్టలేదంటున్నారు. ఇది గొట్టిపాటిని మరింత గాయపర్చిందని అంటున్నారు. ఈ కారణంగానే ఆయన టిడిపి వైపు మొగ్గు చూపేలా చేసిందని అంటున్నారు.

English summary
YSRC Addanki MLA Gottipati Ravi Kumar to join Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X