2024 ఎన్నికలపై ఈసీకి వైసీపీ 9 ప్రశ్నలు..! సమాధానం ఎందుకివ్వరు..?
2024లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకోవడం వల్లే తాము 40శాతం ఓట్లు తెచ్చుకున్నా 11 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చిందనే ఆగ్రహం వైఎస్సార్సీపీకి (YSRCP) ఎప్పటి నుంచో ఉంది. ఇదే అంశంపై ఎన్నికల సంఘానికి తమ అనుమానాల్ని నేరుగానే ఫిర్యాదు చేసిన ఆ పార్టీ నేతలు.. ఆ తర్వాత కూడా బహిరంగంగా ఎన్నోసార్లు ప్రశ్నించారు. అయినా ఈసీ నుంచి సమాధానం లేదు. ఇప్పుడు ఎస్ఐఆర్ అక్రమాల నేపథ్యంలో ఎన్నికల సంఘంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వెల్లువెత్తుతున్న తరుణంలో వైఎస్సార్సీపీ ఈసీని మరోసారి టార్గెట్ చేసింది.
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ మరోసారి తొమ్మిది ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానాలు ఎందుకు లేవని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది. ఇందులో పలు కీలక అంశాలు ఉన్నాయి. వీటిలో మొదటిది పోలింగ్ సమయం ముగిసిన తర్వాత నమోదైన ఓట్లు, రాత్రి 11:45 గంటల తర్వాత కూడా కొనసాగిన పోలింగ్, సాయంత్రం 6 గంటల తర్వాత ఓటింగ్ శాతంలో మార్పులు వంటి అంశాలను ప్రస్తావించింది. గతంలో వీటిని రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ కూడా ప్రశ్నించారు.

9 straight questions to the Election Commission on the 2024 Andhra Pradesh elections. Why are there no answers yet ?@CEOAndhra@ECISVEEP https://t.co/PJxbRw3Ec5
— YSR Congress Party (@YSRCParty) October 13, 2026
అలాగే వీవీప్యాట్ స్లిప్పుల భద్రత, ఈవీఎం బ్యాటరీ రీడింగుల్లో మార్పులకు సంబంధించిన సాంకేతిక నివేదికలు, ఈవీఎంల ధృవీకరణ సమయంలో అభ్యర్థులు కోరిన పరీక్షలు నిర్వహించకపోవడం, ఫారం 20 పత్రాల విడుదలలో ఆలస్యం వంటి అంశాలపై వివరణ కోరింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఒకే పోలింగ్ కేంద్రాల ఓట్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయా? పోస్టర్‌లో పేర్కొన్న 89,499 ఓట్ల వ్యత్యాసాలకు నియోజకవర్గాల వారీగా వివరణ ఏమిటి? అనే ప్రశ్నలను కూడా వైఎస్సార్సీపీ లేవనెత్తింది. అలాగే 2024 ఎన్నికల గణాంకాలు, పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన రికార్డులపై స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ కోరుతోంది. ఈ ప్రశ్నలపై ఎన్నికల సంఘం ఇప్పటివరకూ స్పందించలేదు. దీంతో ఇప్పుడు వైఎస్సార్సీపీ మరోసారి ఇదే ప్రశ్నల్ని సంధిస్తోంది. ఇప్పుడు ముప్పేట దాడి వేళ ఈసీ సమాధానం చెప్తుందా లేక ఎప్పటిలాగే తప్పించుకుంటుందా అనేది చూడాలి.













Click it and Unblock the Notifications
