స్థానిక ఎన్నికల్లో బీజేపీకి సీట్లు ఖరారు, లిస్టులో..!?
ఏపీలో స్థానిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. కూటమి పార్టీల్లో సీట్ల సర్దుబాటు పైన చర్చలు జరుగుతున్నాయి. రిజర్వేషన్లు ఖరారు కావటంతో అభ్యర్దుల ఎంపిక పైనా కసరత్తు కొనసాగుతోంది. అటు జనసేన, ఇటు బీజేపీ కి మేయర్ సీట్ల విషయంలో దాదాపు స్పష్టత వచ్చింది. బీజేపీ నేతలు తాజాగా సీఎం చంద్రబాబుతో జరిపిన చర్చల్లో తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
స్థానిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపు పైన కూటమిలో తుది దశ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు పార్టీలు ఏ నిష్ఫత్తిలో పోటీ చేయాలనే అంశం పైన ఒక నిర్ణయానికి వచ్చాయి. రిజర్వేషన్ల ఖరారు తో తమ అంచనాలు మారాయంటూ తాజాగా సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో జనసేన, బీజేపీ కొంత అసంతృప్తి వ్యక్తం చేసారు. కాగా.. సీఎం చంద్రబాబు దీని పై స్పష్టత ఇచ్చారు. రిజర్వేషన్ల ప్రకటనపై తమ పార్టీలోనూ అసంతృప్తి ఉన్నప్పటికీ చట్టబద్ధంగా జరగా ల్సిన ప్రక్రియలో రాజకీయ జోక్యం ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని, రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. తాము ముందుగా అనుకున్న స్థానాలు రిజర్వేషన్ల కారణంగా తారుమారు అయ్యాయని... కొత్త స్థానాల ఎంపిక, అక్కడ అభ్యర్థులు ఎవరన్న దానిపై తమ పార్టీల నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకునేందు కు కొంత సమయం కావాలని కోరారు.

బీజేపికి దక్కే సీట్ల పై స్పష్టత..!
దీంతో, ఈ రోజు మరోసారి బీజేపీ నేతలు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి, విశాఖ, అనంతపురంలలో రెండు కార్పొరేషన్లు కేటాయించాలని బీజేపీ నేతలు ప్రతిపాదించారు. అయితే.. బీజేపీకి ఒక కార్పోరేషన్, 10 మున్సిపాల్టీలు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. నెల్లూరులో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ బీజేపీ పోటీ చేయడం సరైన నిర్ణయం కాబోదని టీడీపీ నేతలు సూచించడంతోపాటు తిరుపతి స్థానం నుంచి టీడీపీ బరిలో ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా, చివరి నిమిషంలో జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరించిన నేత జోక్యంతో నెల్లూరు సీటు బీజేపీకి కేటాయిస్తున్నట్లు చెబుతున్నారు. ముందుగా మున్సిపల్ సీట్ల పైన స్పష్టత వచ్చిన తరువాత రెండు రోజుల్లో జిల్లా పరిషత్ సీట్ల పైన కూటమి నేతలు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బీజేపీకి పది మున్సిపాల్టీ సీట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications
