Budget 2026: Gold Loan పై జీఎస్టీ ఛార్జీలు తగ్గుతాయా?
ఇంట్లో లాకర్ తెరిస్తే మెరిసేది కేవలం ఆభరణాలు మాత్రమే కాదు... దేశ ఆర్థిక శక్తి కూడా! భారత్ 2047 నాటికి 'వికసిత్ భారత్'గా మారాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్న వేళ, ఇళ్లలో నిరుపయోగంగా పడిపోయిన బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలన్న చర్చ మళ్లీ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్ 2026పై సామాన్యుల నుంచి పరిశ్రమ వర్గాల వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి.
భారతీయుల వద్ద ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉంది. అంచనా ప్రకారం ఇళ్లలో దాచుకున్న బంగారం సుమారు 34,600 టన్నులు. కానీ అది లాకర్లలోనే ఉండిపోతే దేశానికి ఉపయోగం ఏముంటుంది? ఈ బంగారాన్ని డిజిటల్ గోల్డ్ రూపంలోకి మార్చితే దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం లభిస్తుంది.

ఇప్పుడు బంగారం ధర తులానికి దాదాపు రూ.1.5 లక్షలకు చేరడంతో, పెద్ద ఆభరణాల కంటే ఒక గ్రాము గోల్డ్, చిన్న కాయిన్స్ కొనుగోలు చేసే ట్రెండ్ పెరిగింది. కానీ ఇవన్నీ లాకర్లకే పరిమితమవుతున్నాయి. అందుకే డిజిటల్ గోల్డ్‌ను ప్రోత్సహించే విధానాలు బడ్జెట్‌లో రావాలని పరిశ్రమ కోరుతోంది.
సావరీన్ గోల్డ్ బాండ్లు మళ్లీ వస్తాయా?
ఒకప్పుడు సావరీన్ గోల్డ్ బాండ్లు (SGB) మంచి స్పందన పొందాయి. బంగారం కొనుగోలు చేసినా, వడ్డీ వస్తుంది... పైగా భద్రత కూడా ఉంటుంది. ఇటీవల ఈ స్కీమ్ నిలిపివేయడంపై చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వం మళ్లీ బడ్జెట్ 2026లో SGBలను పునఃప్రారంభిస్తే, ప్రజల బంగారు పొదుపు నేరుగా దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని నిపుణుల అభిప్రాయం.
గోల్డ్ లోన్లు - పేదలకి పెద్ద సాయం
గోల్డ్ లోన్లు అంటే కేవలం ఖర్చుల కోసమే అనుకునేవారు చాలా మంది ఉన్నారు. కానీ వాస్తవానికి ఇవి రైతులు, చిన్న వ్యాపారులు, గ్రామీణ కుటుంబాలకు కీలక ఆర్థిక ఆధారం. గోల్డ్ లోన్ వడ్డీపై జీఎస్టీ లేకపోయినా... ప్రాసెసింగ్ ఫీజులు, లోన్ పొడిగింపు ఛార్జీలపై 18% జీఎస్టీ పడుతోంది. ఇది సామాన్యులకు భారం అవుతోంది. దీనిపై బడ్జెట్‌లో ఉపశమనం ఇవ్వాలన్న డిమాండ్ ఉంది.
గోల్డ్ లోన్ మార్కెట్ ఎంత పెద్దది?
- 2025 మార్చి నాటికి: రూ.12 లక్షల కోట్లు
- 2027 నాటికి అంచనా: రూ.18 లక్షల కోట్లు
ఈసారి బడ్జెట్ కేవలం పన్నులు, రాయితీలకే పరిమితం కాకుండా... ఇళ్లలో ఉన్న బంగారాన్ని దేశాభివృద్ధి బాటలోకి తీసుకువచ్చేలా నిర్ణయాలు తీసుకుంటే, భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడం అంత కష్టం కాదు. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకోవాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications