తండ్రి ఆస్తిలో పిల్లలకు వాటా ఉందదా? పిత్రార్జితం Vs స్వార్జితం
"మా నాన్న ఆస్తి.. నాకూ హక్కు ఉంటుంది" అని చాలామంది ధీమాగా ఉంటారు. కానీ, చట్టం దృష్టిలో ప్రతి ఆస్తికి ఒక లెక్క ఉంటుంది. తండ్రి దగ్గర ఉన్న ప్రతి గజం స్థలంపై పిల్లలకు జన్మతః హక్కు రాదు. ఆ ఆస్తి తండ్రికి ఎలా వచ్చిందనే దానిపైనే పిల్లల హక్కులు ఆధారపడి ఉంటాయి. ఆస్తి 'పిత్రార్జితమా' (Ancestral) లేదా 'స్వార్జితమా' (Self-acquired) అనే చిన్న తేడా.. మీ చట్టబద్ధమైన పోరాటాన్ని, ఫలితాన్ని తలకిందులు చేయగలదు.
ఒక తండ్రి తన కష్టార్జితంతో, సొంత డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తిని 'స్వార్జిత ఆస్తి' అంటారు. దీనిపై ఆయనకు సర్వాధికారాలు ఉంటాయి. దాన్ని ఎవరికి ఇవ్వాలి? అమ్మేయాలా? లేదా వీలునామా రాసి ఎవరికైనా దానం చేయాలా? అన్నది పూర్తిగా ఆయన ఇష్టం. ఇందులో పిల్లలు వాటా అడిగే చట్టబద్ధమైన హక్కు లేదు. 1956 హిందూ వారసత్వ చట్టం ప్రకారం, తండ్రి తన ఆస్తిని తన ఇష్టప్రకారం ఎవరికైనా ఇవ్వవచ్చు. ఒకవేళ తండ్రి వీలునామా రాయకుండా చనిపోతేనే, సెక్షన్ 8 ప్రకారం ఆ ఆస్తి పిల్లలకు సమానంగా పంచుతారు. అప్పటి వరకు అది ఆయన సొంత సామ్రాజ్యం మాత్రమే.

పిత్రార్జితం అంటే ఏది? మన వాటా ఎప్పుడు వస్తుంది?
పురుష వంశంలో విభజన జరగకుండా నాలుగు తరాల నుండి సంక్రమిస్తున్న ఆస్తిని 'పిత్రార్జితం' అంటారు. హిందూ అవిభాజ్య కుటుంబం (HUF)లో జన్మించిన ప్రతి బిడ్డకు (2005 సవరణ తర్వాత కుమార్తెలకు కూడా) ఆ ఆస్తిపై పుట్టగానే హక్కు వస్తుంది. ఈ ఆస్తిని విక్రయించాలన్నా, వేరే ఎవరికైనా బదిలీ చేయాలన్నా ఇంట్లోని సహ-వారసులందరి (Coparceners) అనుమతి తప్పనిసరి. వారసుల అనుమతి లేకుండా తండ్రి ఈ ఆస్తిని ఇతరులకు అప్పగించలేరు. ఒకవేళ వారసులు మైనర్లు అయితే, వారి సంరక్షకుల ద్వారా సమ్మతి తీసుకోవాల్సి ఉంటుంది.
కోర్టులు ఏమంటున్నాయి?
ఆస్తి వివాదాలపై సుప్రీంకోర్టు గతంలో అనేక కీలక తీర్పులు ఇచ్చింది. 1986లో 'కమిషనర్ ఆఫ్ వెల్త్ టాక్స్ vs చందర్ సేన్' కేసులో కోర్టు స్పష్టంగా చెప్పింది.. తండ్రి నుండి ఒక కుమారుడికి ఆస్తి వచ్చినప్పుడు, అది స్వతంత్ర వ్యక్తిగా ఆయన పొందిన ఆస్తిగా పరిగణించాలి తప్ప, అది వెంటనే ఆయన పిల్లలకు పిత్రార్జితం అయిపోదు. అంటే, తండ్రికి తన తండ్రి నుండి వాటాగా వచ్చిన ఆస్తిని కూడా కొన్ని సందర్భాల్లో ఆయన స్వార్జితంగానే పరిగణిస్తారు.
పిత్రార్జితం కావాలంటే ఉండాల్సిన ప్రధాన షరతులు:
- ఆ ఆస్తి కనీసం నాలుగు తరాల నుండి పురుష వంశీకుల యాజమాన్యంలో ఉండాలి.
- ఆస్తి ఎక్కడా విభజన (Partition) జరిగి ఉండకూడదు.
- వీలునామా ద్వారా గానీ, బహుమతి (Gift Deed) రూపంలో గానీ వచ్చిన ఆస్తి పిత్రార్జితం కిందకు రాదు.
- కుటుంబ సభ్యులే కాకుండా బయటి వ్యక్తుల నుండి లేదా తల్లి తరపు బంధువుల నుండి వచ్చిన ఆస్తిని కూడా పిత్రార్జితంగా పరిగణించరు.
కాబట్టి, ఆస్తి విషయంలో గొడవలకు దిగే ముందు.. అది తాతల నుండి వచ్చిందా? లేక నాన్న కష్టపడి కొన్నదా? అనేది స్పష్టంగా తెలుసుకోవాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. చట్టాల పట్ల అవగాహన ఉంటేనే ఆస్తి హక్కులను కాపాడుకోగలమని గుర్తుంచుకోవాలి.












Click it and Unblock the Notifications