ఆస్తి హక్కుల్లో కొత్త ట్విస్ట్! కూతురు vs భార్య.. ఎవరికి పవర్ ఎక్కువ?
హిందూ అవిభాజ్య కుటుంబం (HUF)లో ఆస్తి వ్యవహారాలు, ముఖ్య నిర్ణయాల విషయంలో ఒకప్పుడు పురుషులదే పైచేయిగా ఉండేది. కానీ, గత రెండు దశాబ్దాలుగా వచ్చిన చట్టపరమైన మార్పులు మహిళల హక్కులను పూర్తిగా మార్చేశాయి. ముఖ్యంగా, 'ఒక మహిళ HUFకి యజమాని (కర్త) కాగలదా?' అనే ప్రశ్నకు ఇప్పుడు చట్టం 'అవును' అని సమాధానం చెబుతోంది. అయితే, ఇక్కడ ఆమె ఆ కుటుంబంలో పుట్టిన 'కూతురా' లేదా కోడలిగా వచ్చిన 'భార్య' అన్న దానిపైనే ఆమె హక్కులు ఆధారపడి ఉంటాయి.
పూర్వం హక్కుల గురించి చూస్తే, 2005 కంటే ముందు HUFలో కేవలం కొడుకులకు మాత్రమే ఆస్తిపై హక్కు ఉండేది. కుటుంబంలో పెద్దవాడైన పురుష సభ్యుడే 'కర్త'గా ఉండేవారు. కానీ, 'హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 2005' ఒక పెను మార్పును తెచ్చింది. ఈ చట్టం ప్రకారం, కొడుకులతో సమానంగా కూతుళ్లకు కూడా పుట్టుకతోనే ఆస్తిపై సర్వహక్కులు (Coparcenary rights) లభించాయి. అంటే, ఒక కుటుంబంలో కూతురు అందరికంటే పెద్దదైతే, ఆమె ఆ HUFకి 'కర్త'గా వ్యవహరించే అధికారం పొందింది. ఇది నాయకత్వంలో లింగ వివక్షను తొలగించి, సీనియారిటీకి పట్టం కట్టింది.

కూతురుకుండే హక్కులు కోడలికుండవా?
అయితే, ఇక్కడే ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఒక ఇంట్లో పుట్టిన కూతుళ్లకు ఉన్న హక్కులు, ఆ ఇంటికి కోడలిగా వచ్చే వారికి ఉండవు. చట్టం ప్రకారం కూతుళ్లు 'సహభాగస్తులు' (Coparceners), కానీ కోడులు కేవలం 'సభ్యులు' (Members) మాత్రమే. ఈ చిన్న తేడాయే వారి అధికారాలను నిర్ణయిస్తుంది. కుటుంబంలో పుట్టిన పిల్లలకు ఆస్తిపై పుట్టుకతోనే యాజమాన్య హక్కు వస్తుంది. కానీ వివాహం ద్వారా కుటుంబంలోకి ప్రవేశించే కోడలు కేవలం సభ్యురాలిగా గుర్తింపు మాత్రమే ఉంటుంది.
ఆస్తిపై అధికారం..
హక్కుల పరంగా చూస్తే, సహభాగస్తులైన కూతుళ్లకు ఆస్తిలో వాటా అడిగే అధికారం, ఆస్తిని నిర్వహించే హక్కు, అలాగే 'కర్త' అయ్యే అర్హత ఉంటాయి. కానీ భార్యకు ఆస్తిపై నేరుగా యాజమాన్య హక్కు ఉండదు. ఆమెకు కేవలం కుటుంబం నుండి జీవనభృతి (Maintenance) పొందే హక్కు, ఇతర అవసరాలకు ఖర్చులు పొందే అధికారం మాత్రమే ఉంటాయి. అంటే భార్య హక్కులు కేవలం రక్షణకు సంబంధించినవే తప్ప, ఆస్తిపై అధికారం చలాయించేవి కావు.
ప్రస్తుత చట్టాల ప్రకారం..
కుటుంబంలో 'కర్త' పాత్ర చాలా కీలకమైనది. ఆస్తిని నిర్వహించడం, పెట్టుబడులు పెట్టడం, కోర్టులు లేదా పన్ను అధికారుల ముందు కుటుంబానికి ప్రాతినిధ్యం వహించడం వంటివన్నీ కర్త బాధ్యతలే. ప్రస్తుత చట్టాల ప్రకారం, ఒక కూతురు తన కుటుంబంలో అందరికంటే పెద్దదైతే, ఆమె ఈ బాధ్యతలన్నింటినీ స్వీకరించి HUFను నడిపించవచ్చు.
మొత్తంగా చెప్పాలంటే, HUFలో అధికారం అనేది ఇప్పుడు 'లింగం' (ఆడ-మగ) మీద కాకుండా, కుటుంబంలో ఆ వ్యక్తికున్న 'చట్టపరమైన హోదా' (పుట్టుకతో వచ్చిన హక్కు) మీద ఆధారపడి ఉంటుంది. వారసత్వ ఆస్తులు లేదా పన్ను ఆదా కోసం HUFని ఉపయోగించే ప్రతి కుటుంబం ఈ తేడాలను తెలుసుకోవడం చాలా అవసరం. కూతుళ్లు ఇప్పుడు కేవలం ఆస్తిలో భాగస్వాములు మాత్రమే కాదు, అవసరమైతే కుటుంబానికి దిశానిర్దేశం చేసే 'కర్త'లు కూడా కావచ్చు.












Click it and Unblock the Notifications