EPF : ఉద్యోగులకు శుభవార్త.. ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటు?
ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాదారులకు ఇది శుభవార్త. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ EPF డిపాజిట్ ఖాతాలపై 8.25% వడ్డీ రేటును కొనసాగించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 7 కోట్ల మంది చందాదారులకు లబ్ధి చేకూరనుంది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో కూడా ఇదే వడ్డీ రేటును చెల్లించారు.
CBT సిఫార్సు, ఆర్థిక శాఖ ఆమోదం:
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపనున్నారు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత, వడ్డీ రేటును అధికారికంగా EPFO నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత, వడ్డీ మొత్తాన్ని చందాదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఆర్థిక శాఖ త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.

గతంలో వడ్డీ రేట్ల తగ్గింపు:
గతంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి EPF వడ్డీ రేటును 8.10 శాతానికి తగ్గించారు. ఇది 1977-78 తర్వాత కనిష్ట స్థాయికి చేరడం గమనార్హం. అయితే, ఆ తర్వాత వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచుతూ వచ్చారు. ఇప్పుడు 2024-25 సంవత్సరానికి కూడా అదే రేటును కొనసాగించాలని నిర్ణయించడం ఉద్యోగులకు ఊరటనిచ్చే విషయం.
గత పదేళ్లలో EPF వడ్డీ రేట్లు
గత పదేళ్లలో EPF వడ్డీ రేట్లను పరిశీలిస్తే 2014-15 గాను 8.75 శాతం, 2015-16 లో 8.80 శాతం, 2016-17 సంత్సరానికి 8.65 శాతం, 2017-18 గాను 8.55 శాతం, 2018-19 లో 8.65 శాతం, 2019-20 ఏడాదిలో 8.50 శాతం, 2020-21 సంవత్సరంలో 8.50 శాతం, 2021-22 లో 8.10 శాతం, 2022-23లో 8.15 శాతం, 2023-24 సంత్సరానికి 8.25 శాతం చొప్పుడు వడ్డీ రేటును చెల్లించింది. దీనిని బట్టి చూస్తే EPF వడ్డీ రేట్లు గత కొన్నేళ్లుగా స్థిరంగా ఉన్నాయని లేదా స్వల్పంగా పెరుగుతూ వచ్చాయని తెలుస్తుంది.
ఉద్యోగుల భవిష్యత్తు సురక్షితం:
EPF అనేది ఉద్యోగుల కోసం ఒక ముఖ్యమైన పొదుపు పథకం. ఇది ఉద్యోగుల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది. EPFలో ఉద్యోగి, యజమాని ఇద్దరూ సమానంగా డబ్బును జమ చేస్తారు. ఈ డబ్బుకు ప్రభుత్వం నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం వడ్డీ లభిస్తుంది. EPF ఖాతా నుంచి డబ్బును కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతిస్తారు. ఉద్యోగం కోల్పోయినప్పుడు, వైద్య ఖర్చుల కోసం, లేదా ఇంటి నిర్మాణం కోసం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications