చిక్కెంట్రుకలకు గిన్నెలు, బోళ్లు, బఠాణీలు.. వేల కోట్ల దందా!
మనం ప్రతి గ్రామం, నగరం, పట్టణాల్లో వీధుల్లో తిరిగుతూ వెంట్రుకలకు గిన్నెలు, గ్లాసులు, బఠాణీలు, పీచుమిఠాయి అంటూ అరిచే మహిళలను చూస్తూనే ఉంటాం. సాధారణంగా మహిళలు తల దువ్వినప్పుడు రాలిన వెంట్రుకలను పారేయకుండా ఒకచోట దాచి ఉంచుతారు. అలా సేకరించిన జట్టును వీధుల్లో వచ్చే వ్యాపారులకు విక్రయించి.. దానికి బదులుగా ఇంట్లోకి అవసరమైన గిన్నెలు లేదా పిల్లలకు తినిబండారాలు కొనుగోలు చేస్తుంటారు. చాలా మంది మహిళలు రాలిన వెంట్రుకల విలువ తెలియక చెత్తబుట్టలో పారేస్తుంటారు. కానీ సాదాసీదాగా కనిపించే ఈ తల వెంట్రుకల వెనుక ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల భారీ బిజినెస్ నడుస్తోందని విషయం చాలా మందికి తెలియదు. ఈ వ్యాపారాన్ని నమ్ముకుని అపారమైన లాభాలు గడించి కోటీశ్వరులైన వారు కూడా మన దేశంలో ఉన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో హెయిర్ బిజినెస్ హవా
తల వెంట్రుకలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయల ఎగుమతి వ్యాపారం జరుగుతోంది. ఇండియాలో కూడా ఈ జట్టు వ్యాపారాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని కోట్లకు కోట్లు సంపాదిస్తున్న అంతర్జాతీయ వ్యాపారవేత్తలు ఎందరో ఉన్నారు. ఇండియా నుంచి ప్రతి ఏటా దాదాపు కొన్ని మిలియన్ డాలర్ల విలువైన తల వెంట్రుకలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కేవలం రాలిన జట్టే కాకుండా తల నుంచి కత్తిరించిన నాణ్యమైన వెంట్రుకలతో కూడా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. ఇందుకోసమే గ్రామీణ ప్రాంతాల నుంచి మెట్రో నగరాల వరకు ప్రతి ఇంటికీ వెళ్లి మరీ వ్యాపారులు వెంట్రుకలను సేకరిస్తుంటారు.

జుట్టు నాణ్యతను బట్టి ధర.. కిలో రూ.50వేలకు పైనే!
ఈ మార్కెట్లో వెంట్రుకల ధర అనేది పూర్తిగా వాటి నాణ్యత, పొడవు, దృఢత్వంపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో అత్యంత తక్కువ నాణ్యత గల జట్టుకు కూడా కిలోకు రూ.10 వేల నుంచి 12 వేల వరకు ధర పలుకుతుంది. అదే జట్టు కాస్త నాణ్యతతో, ఎలాంటి రసాయనాలు వాడకుండా ఉంటే సులభంగా కిలోకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు లభిస్తుంది. వెంట్రుకలు ఎంత పొడవుగా ఉంటే అంత ఎక్కువ రేటు వస్తుంది. మన దేశంలో కోల్‌కతా, చెన్నై, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాలకు చెందిన పెద్ద వ్యాపారవేత్తలు ఈ వెంట్రుకలను హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తుంటారు. వీరు స్థానికంగా సేకరించిన వారి నుంచి తక్కువ ధరకు కొని.. విదేశాలకు భారీ రేట్లకు అమ్ముతూ లాభాలు అర్జిస్తున్నారు. కోల్‌కతా నుంచి సేకరించే వెంట్రుకలలో దాదాపు 90 శాతం నేరుగా చైనాకే ఎగుమతి అవుతుండటం విశేషం. అయితే భారతీయ మార్కెట్లో గుజరాత్ మహిళల వెంట్రుకలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. అక్కడి వాతావరణం, ఆహారు అలవాట్ల వల్ల జుట్టు చాలా దృఢంగా, నిగనిగలాడుతూ మెరుస్తూ ఉండటమే దీనికి ప్రధాన కారణం.
విగ్గుల తయారీ నుంచి రసాయన ప్రక్రియల వరకు..
సేకరించిన వెంట్రుకలను నేరుగా విదేశాలకు పంపరు. దీని వెనుక పెద్ద ప్రాసెసింగ్ ప్రక్రియ ఉంటుంది. ఈ వెంట్రుకలను ప్రధానంగా అంతర్జాతీయంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియలో, రకరకాల విగ్గుల తయారీలో విరివిగా వినియోగిస్తారు. సేకరించిన ముడి జుట్టును తొలుత ఫ్యాక్టరీల్లో రకరకాల షాంపూలు, నీటితో శుభ్రం చేస్తారు. ఆ తర్వాత వాటిని కొన్ని ప్రత్యేక రసాయన ద్రావణాల్లో ఉంచి క్రిమిరహితం చేస్తారు. అనంతరం అత్యాధునిక యంత్రాల సాయంతో జట్టును స్ట్రెయిట్ చేసి ఎగుమతికి సిద్ధం చేస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండాలంటే వెంట్రుకల పొడవు కనీసం 8 అంగుళాలు ఉండాలి. ఇటువంటి పొడవాటి జుట్టుకే విదేశీయులు హాట్ కేకుల్లా ధరలు చెల్లిస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా భారత జుట్టుకు ఫుల్ డిమాండ్
ఇండియాలో ఈ జుట్టు వ్యాపారానికి ఎంతో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. మన దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచే ఈ వెంట్రుకల వ్యాపారం నిరాటంకంగా సాగుతోంది. ముఖ్యంగా భారతీయ మహిళల జట్టుకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అభిమానులు, క్లయింట్లు ఉన్నారు. పాశ్చాత్య దేశాల మహిళలతో పోలిస్తే భారతీయ మహిళల జట్టు సహజంగానే చాలా పొడవుగా, నల్లగా, ఒత్తుగా మెరుస్తూ ఉంటుంది. అలాగే ఎలాంటి కృత్రిమ రంగులు వేయని సహజమైన జుట్టుకైతే అంతర్జాతీయ మార్కెట్లో తిరుగులేని డిమాండ్ ఉంటుంది. బాగా పొడవు ఉండి దృఢంగా ఉండే నిగనిగలాడే జట్టుకు కిలోకు ఏకంగా రూ.50 వేలకు పైనే చెల్లిస్తారు. మన దేశం నుంచి ఈ వెంట్రుకలు ఆసియా దేశాలైన చైనా, మలేషియా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్‌లతో పాటు అమెరికా, యూరప్ దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి.
పుణ్యక్షేత్రాల తలనీలాలు.. వ్యాపార అవకాశాలు
మన దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిత ఆలయాల్లో భక్తులు తమ మొక్కుల రూపంలో తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా కలియుగ దైవం తిరుమతి తిరుపతి వెంకటేశ్వర స్వామి వంటి అంతర్జాతీయ పుణ్యక్షేత్రాల్లో నిత్యం వేలాది మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తుంటారు. అలా భక్తుల ద్వారా సేకరించిన టన్నుల కొద్దీ వెంట్రుకలను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ-వేలం ద్వారా అంతర్జాతీయ వ్యాపారాలకు విక్రయిస్తుంది. గతంలో 2014 సంవత్సరంలో జరిగిన ఓ వేలంలో టీటీడీ కేవలం తలనీలాల విక్రయం ద్వారానే రూ.220 కోట్ల భారీ ఆదాయాన్ని ఆర్జించిందంటే ఈ బిజినెస్ పరిధి ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
ఒకవేళ ఎవరైనా నిరుద్యోగులు లేదా చిన్నపాటి పెట్టుబడిదారులు ఈ రంగంలో వ్యాపారం చేయాలనుకుంటే ఇదో అద్భుతమైన అవకాశం. గ్రామాల్లో పట్టణాల్లో ఇంటింటికీ తిరిగి జట్టు సేకరించే చిన్న వ్యాపారులతో నెట్వర్క్ ఏర్పరచుకోవచ్చు. లేదా స్థానిక చిన్న ఆలయ యాజమాన్యాలతో ఒప్పందాలు చేసుకోవచ్చు. అలా సేకరించిన ముడి జట్టును శుభ్రం చేసి, గ్రేడింగ్ నిర్వహించి.. చెన్నై లేదా కోల్‌కతాలోని పెద్ద ఎగుమతి కంపెనీలకు విక్రయించడం ద్వారా ప్రతి నెల ఇంటి వద్దే ఉంటూ భారీగా డబ్బు సంపాదించుకోవచ్చు.












Click it and Unblock the Notifications