Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డాలర్ దెబ్బకు కుప్పకూలిన రూపాయి: సామాన్యుడిపై ప్రభావమెంత?

భారత రూపాయి బుధవారం నాడు డాలర్ మారకంలో చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయింది. తొలిసారిగా ఇది అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూ.90 మార్కును దాటింది. ఆసియాలోనే ఈ ఏడాది అత్యంత దారుణంగా పడిపోయిన ప్రధాన కరెన్సీగా రూపాయి నిలిచింది. రూపాయి పతనం అనేదీ కొత్తేమీ కాదు.. కానీ దాని పర్యావసానాలు మాత్రం సందర్భాన్ని బట్టి మారూతూ ఉంటాయి. భారత ఆర్థిక వ్యవస్థతో పాటు సామాన్యుడి జీవితంపై కూడా దీని ప్రభావం ఉంటుంది. రూపాయి విలువ పతనం దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా దిగుమతులు, ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దిగుమతుల నుంచి విదేశీ చదువుల వరకు అన్నీ భారమవుతాయి. కొన్ని రంగాలకు నష్టం కలిగితే, మరికొన్ని రంగాలు మాత్రం లాభపడనున్నాయి.

రూపాయి పతనానికి ప్రధాన కారణాలు
రూపాయి బలహీనపడటానికి ప్రధానంగా ఈ క్రింది అంశాలు దోహదపడుతున్నాయి.

*విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ: విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ నుంచి నిరంతరంగా డబ్బును వెనక్కి తీసుకోవడం. ఈ ఏడాది ఇప్పటివరకు వారు 17 బిలియన్ డాలర్లకు పైగా నిధులను ఉపసంహరించుకున్నారు.

Indian Rupee Crashes Past Rs 90 Against USD Impact on Common Man Loss and Gain Sectors Explained

*పెరుగుతున్న వాణిజ్య లోటు: అక్టోబర్‌లో వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో 41.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. దిగుమతులు ఎక్కువగా, ఎగుమతులు తక్కువగా ఉండటం వల్ల ఈ లోటు పెరుగుతుంది, ఇది రూపాయి డిమాండ్‌ను తగ్గిస్తుంది.

*భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఆలస్యం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక-రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు.

నష్టపోయే రంగాలు
రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతులు ఖరీదైనవిగా మారతాయి, దీని ప్రభావం అనేక కీలక రంగాలపై పడుతుంది:

*చమురు దిగుమతి: భారతదేశం తన అవసరాలకు 85 శాతానికి పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. రూపాయి బలహీనపడితే ముడి చమురు కొనుగోలుకు అధిక రూపాయలు చెల్లించాలి. చమురు ధరలు మారకపోయినా, దిగుమతి వ్యయం పెరుగుతుంది.

*ఎరువులు: ఎరువుల కోసం దిగుమతులపై ఆధారపడటం వల్ల దిగుమతి ఖర్చులు పెరుగుతాయి. ఈ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వ ఎరువుల రాయితీ బిల్లు పెరుగుతుంది.

*విదేశీ విద్య/రుణాలు: విదేశాల్లో చదువుకోవడానికి డాలర్లలో చెల్లించాల్సిన ఫీజుకు ఎక్కువ రూపాయలు అవసరమవుతాయి. విద్యారుణాలు, ఈఎంఐలు పెరుగుతాయి.

*బంగారం, వెండి: భారతదేశం అధిక మొత్తంలో బంగారం, వెండిని దిగుమతి చేసుకుంటుంది. రూపాయి పతనం వల్ల దిగుమతి వ్యయం పెరిగి, వినియోగదారులకు నగలు ఖరీదైనవిగా మారతాయి.

*కార్లు, ఎలక్ట్రానిక్స్: స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ఏసీలు, లగ్జరీ కార్లు, ఎలక్ట్రిక్ వాహనాలలో విదేశాల నుంచి దిగుమతి అయ్యే విడిభాగాల శాతం ఎక్కువ. రూపాయి బలహీనపడటం వల్ల వాటి ఉత్పత్తి వ్యయం పెరిగి, తుది ధరలు పెరుగుతాయి.

*ఎయిర్‌లైన్స్: ఎయిర్‌లైన్స్ ఖర్చుల్లో ఇంధనం, విమానాల లీజు అద్దెలు విదేశీ కరెన్సీల్లో ఉంటాయి. రూపాయి బలహీనపడటం వల్ల ఆ ఖర్చులు పెరిగి, విమాన ప్రయాణం ఖరీదైనదిగా మారవచ్చు.

*విదేశీ రుణాలు: విదేశీ కరెన్సీల్లో తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడానికి ఎక్కువ రూపాయలు అవసరమవుతాయి. విదేశీ రుణాలు ఉన్న కంపెనీలకు వడ్డీ భారం పెరుగుతుంది.

లాభపడే రంగాలు
రూపాయి పతనం కొన్ని రంగాలకు పోటీతత్వాన్ని పెంచి, లాభదాయకంగా మారుతుంది.

ఐటీ, ఫార్మా: ఈ కంపెనీల ఆదాయంలో అధిక భాగం డాలర్లలో ఉంటుంది (ఎగుమతులు). రూపాయి విలువ తగ్గితే, డాలర్‌ను రూపాయలలోకి మార్చుకున్నప్పుడు వారికి అధిక ఆదాయం లభిస్తుంది. ఇది వారి లాభాలను పెంచుతుంది.

ఎగుమతిదారులు: రూపాయి బలహీనపడటం వల్ల భారతీయ వస్తువుల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో చౌకగా మారతాయి. ఇది భారతీయ ఎగుమతులను పెంచడానికి, చైనా వంటి దేశాల చౌక దిగుమతులపై అడ్డుకట్ట వేయడానికి సహాయపడుతుంది.

విదేశాల నుంచి వచ్చే డబ్బు : విదేశాల్లో నివసించే భారతీయులు డాలర్లను లేదా ఇతర కరెన్సీలను పంపినప్పుడు, వారికి ఎక్కువ రూపాయలు లభిస్తాయి. ఇది దేశానికి విదేశీ కరెన్సీ ప్రవాహాన్ని పెంచుతుంది. వాణిజ్య లోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

షేర్ మార్కెట్, ద్రవ్యోల్బణంపై ప్రభావం
*షేర్ మార్కెట్: రూపాయి అస్థిరత కారణంగా మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతుంది. విదేశీ పెట్టుబడిదారులు రూపాయి స్థిరపడే వరకు వేచి చూసే అవకాశం ఉంది.

*ద్రవ్యోల్బణం: దిగుమతి అయ్యే వస్తువుల ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు కనిష్ట స్థాయిలో 0.25 శాతం వద్ద ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+