పెట్రోల్, డీజిల్‌కు గుడ్‌బై.. పవర్ఫుల్ ఎలక్ట్రిక్ బేబీ డిఫెండర్ వచ్చేస్తోంది!
'డిఫెండర్' అనే పేరు వినగానే కొండలు, గుట్టలు, సాహసయాత్రలు, శక్తివంతమైన ఇంజిన్‌తో ఎలాంటి కఠినమైన దారులనైనా సునాయాసంగా దాటేసే ఓ దిగ్గజ ఎస్యూవీ కళ్ల ముందు మెదులుతుంది. అయితే ఇప్పుడు ఇదే దర్పం, ఆఫ్-రోడింగ్ సామర్థ్యంతో కూడిన ఓ చిన్న 'బేబీ డిఫెండర్' మార్కెట్లోకి రాబోతోంది. కానీ ఇందులో ఓ పెద్ద మార్పు ఉంది.. అది ఈసారి శబ్ధం ఉండదు, పొగ రాదు, పెట్రోల్-డీజిల్ అవసరం అస్సలు ఉండదు. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తమ అత్యంత చిన్న డిఫెండర్‌ను పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ అవతారంలో తీసుకురావడానికి వేగంగా అడుగులు వేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఈ సరికొత్త ఎస్యూవీ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.
డిఫెండర్ 90 కంటే చిన్నది.. పేరు ఏంటంటే?
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిఫెండర్ 90, 110, 130 మోడళ్ల కంటే ఈ కొత్త ఎలక్ట్రిక్ డిఫెండర్ పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. దీని పొడవు సుమారు 4.5 మీటర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఇటీవల జరిగిన కంపెనీ ఎర్నింగ్స్ కాల్లో జేఎల్ఆర్ అధిపతి పీబీ బాలాజీ ఈ విషయాలను ధ్రువీకరించారు. 2027 చివర్లో ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రొడక్షన్ ప్రారంభమవుతుందని, అదే సమయంలో కొత్త 'రేంజ్ రోవర్ జీటీ' ఉత్పత్తి కూడా మొదలవుతుందని ఆయన వెల్లడించారు. కంపెనీ ఇంకా దీని అధికారిక పేరును ప్రకటించనప్పటికీ.. ఆటోమొబైల్ వర్గాల్లో 'డిఫెండర్ స్పోర్ట్' లేదా 'డిఫెండర్ 80' అనే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. డిఫెండర్, డిస్కవరీ బ్రాండ్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ కామెరూన్ సైతం ఈ ప్రాజెక్ట్ శరవేగంగా సాగుతోందని స్పష్టం చేశారు.

ఆఫ్-రోడింగ్ డీఎన్ఏలో ఏమాత్రం తగ్గదు!
సరికొత్త ఎలక్ట్రిక్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫాంపై ఈ బేబీ డిఫెండర్‌ను నిర్మిస్తున్నారు. సైజులో చిన్నదైనప్పటికీ.. డిఫెండర్‌కు ఉండే అసలైన బలం, ఆఫ్-రోడింగ్ సామర్థ్యం, అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే పర్ఫార్మెన్స్ ఇందులో ఏ మాత్రం తగ్గకుండా కంపెనీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం ఈ వాహనాన్ని అత్యంత కఠినమైన రెండు శీతాకాలపు, రెండు వేసవి టెస్టింగ్ సైకిల్స్‌లో పరీక్షిస్తున్నారు.
డ్యూయల్ మోటార్, 4-వీల్ డ్రైవ్.. హైబ్రిడ్ వెర్షన్ కూడా!
బ్యాటరీ ప్యాక్, రేంజ్ వివరాలను కంపెనీ ఇంకా గోప్యంగా ఉంచినప్పటికీ.. ఇందులో డ్యూయల్ మోటార్ సెటప్ ఉండే అవకాశం ఉంది. ముందు, వెనుక యాక్సిల్స్‌పై వేర్వేరు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండటం వల్ల నాలుగు చక్రాలకు సమానంగా పవర్ అందుతుంది. మెకానికల్ సెంటర్ డిఫరెన్షియల్ లేకుండానే అద్భుతమైన 4-వీల్ డ్రైవ్ అనుభూతిని ఇది అందిస్తుంది. ఎలక్ట్రిక్ మోడల్‌తో పాటు భవిష్యత్తులో దీని హైబ్రిడ్ వెర్షన్ ను కూడా తీసుకురావడంపై జేఎల్ఆర్ పనిచేస్తోంది.














Click it and Unblock the Notifications
