SBI బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి ఏటీఎం రూల్స్ చేంజ్!
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు, ముఖ్యంగా శాలరీ ప్యాకేజ్ అకౌంట్స్ కలిగిన వారికి కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడే శాలరీ ఖాతాదారులకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఉచిత లావాదేవీల సదుపాయంలో బ్యాంక్ కోత విధించింది. రోజురోజుకూ పెరుగుతున్న డిజిటల్ నెట్‌వర్క్, నిర్వహణ వ్యయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఏటీఎం ఉపసంహరణ నిబంధనలు రాబోయే అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలు లేదా నగదు డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మిషన్లలో నెలకు 10 ఉచిత లావాదేవీల వరకు చేసుకునే సౌలభ్యం ఉంది. అయితే అక్టోబర్ 1 నుంచి ఈ పరిమితిని బ్యాంక్ సగానికి తగ్గించేసింది. ఇకపై నెలకు కేవలం 5 ఉచిత లావాదేవీలు మాత్రమే ఉచితంగా లభిస్తాయి. ఇందులో డబ్బులు విత్‌డ్రా చేసుకోవడంతో పాటు బ్యాలెన్స్ చెకింగ్, పిన్ చేంజ్ వంటి నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా కలిసే ఉంటాయి. నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల వినియోగదారులకు ఈ నిబంధన వర్తిస్తుంది.

పరిమితి దాటితే చార్జీల బాదుడు తప్పదు!
కేటాయించిన 5 ఉచిత లావాదేవీల పరిమితి ముగిసిన తర్వాత ప్రతి అదనపు లావాదేవీకి ఖాతాదారులు బాదుడు ఎదుర్కోవాల్సిందే. పరిమితి దాటిన తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంలలో చేసే ప్రతి నగదు ఉపసంహరణకు రూ.23తో పాటు జీఎస్టీ (GST) అదనంగా చెల్లించాలి. అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్ వంటి నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలకు ప్రతిదానికీ రూ.11తో పాటు జీఎస్టీ చార్జీగా కట్ అవుతుంది. సాదాసీదా సాధారణ సేవింగ్స్ ఖాతాదారులకు ఇప్పటికే నెలకు 5 ఉచిత లావాదేవీల నియమం అమలులో ఉండగా, అవే రుసుములు శాలరీ ఖాతాదారులకు కూడా వర్తించనున్నాయి.
స్వంత ఏటీఎంలలో అపరిమిత ఉచిత సేవలు!
అయితే ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయంలో కోత విధించినప్పటికీ.. ఎస్బీఐ సొంత ఏటీఎంలను వాడే ఖాతాదారులకు బ్యాంక్ ఊరటనిచ్చింది. శాలరీ ప్యాకేజ్ అకౌంట్లు, శౌర్య ఫ్యామిలీ పెన్షన్ అకౌంట్లు , ఫ్యామిలీ సేవింగ్స్ అకౌంట్ కలిగిన వినియోగదారులు ఎస్బీఐ సొంత ఏటీఎంలలో ఎన్నిసార్లయినా, అపరిమితంగా ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. వీటికి ఎలాంటి రుసుములు వర్తించవు. సాధారణ ఖాతాదారులకు మాత్రం ఎస్బీఐ ఏటీఎంలలో నెలకు 10 వరకు ఉచిత లావాదేవీల పరిమితి యథాతథంగా కొనసాగుతుంది. ఖాతాదారులు అదనపు చార్జీల భారం పడకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు ఎస్బీఐ ఏటీఎంలనే వాడటం మంచిది.














Click it and Unblock the Notifications