40 ఏళ్ల నాటి రికార్డ్ బ్రేక్.. వెండి ఇప్పుడే కొనాలా? ఆగాలా?
ప్రస్తుతం వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఊహించని విధంగా కిలో వెండి ధర రూ.2 లక్షల మార్కును దాటేసి కొత్త చరిత్ర సృష్టించింది. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ముడిచమురు ధర కంటే వెండి ధర పెరగడం ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వెండి ఇప్పుడు పెట్టుబడిదారులకు వెలుగులు పంచుతోంది. బుధవారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో కిలో వెండి ధర ఏకంగా రూ.2,04,000కు చేరుకుని సరికొత్త రికార్డును నెలకొల్పింది. కేవలం ఏడాది కాలంలోనే వెండి ధర రెట్టింపు అవ్వడం విశేషం. డిసెంబర్ 2024లో కిలో వెండి రూ.90 వేల సమీపంలో ఉండగా.. ఇప్పుడు అది 2 లక్షల మార్కును దాటేయడం గమనార్హం.
40 ఏళ్ల తర్వాత అద్భుతం: చమురుపై వెండి పైచేయి!
అంతర్జాతీయ మార్కెట్‌లో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గత 40 ఏళ్లలో మొదటిసారిగా వెండి ధర ముడి చమురు ధరను అధిగమించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా వెండి ధర ఒక ఔన్స్‌కు 63.06 డాలర్లుగా ఉంది. మరోవైపు ముడి చమురు ధర ఒక బ్యారెల్‌కు 56.19 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ముడి చమురు కంటే వెండి దాదాపు 6 డాలర్ల ప్రీమియంలో ఉండటం గమనార్హం. ఇలాంటి పరిస్థితి చివరిసారిగా 1979లో కనిపించింది. నిపుణులు దీనిని "కొత్త యుగానికి ఆరంభం"గా అభివర్ణిస్తున్నారు.

వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
వెండి కేవలం ఆభరణాలకే పరిమితిం కాకుండా పారిశ్రామికంగా కూడా అత్యంత కీలకమైన లోహంగా మారింది. సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండిని విరివిగా వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి పెరగడం వెండికి కలిసొచ్చింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో కూడా వెండి వినియోగం పెరిగింది. గ్లోబల్ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారం, వెండిని సురక్షితమైన మార్గాలుగా భావిస్తారు.
ముడి చమురు ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
వెండి పెరుగుతుంటే, ముడి చమురు ధరలు మాత్రం గత 4 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 60 డాలర్ల కిందకు జారిపోయింది. చైనా, ఐరోపా దేశాల్లో ఆర్థిక మందగమనం వల్ల చమురుకు డిమాండ్ తగ్గడం, సరఫరా అధికంగా ఉండటం ఇందుకు ప్రధాన కారణాలు.
నిపుణుల హెచ్చరిక
వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ధరలు వేగంగా పెరిగిన నేపథ్యంలో 'ప్రాఫిట్ బుకింగ్' (లాభాల స్వీకరణ) వల్ల ధరల్లో స్వల్ప తగ్గుదల ఉండవచ్చని పెట్టుబడిదారులను హెచ్చరిస్తున్నారు. ఇటీవల ధరలు విపరీతంగా పెరగగా.. మరికొద్ది రోజుల్లో వెండి ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications