వారానికి ఒక్క ఛార్జింగ్ చాలు: 320 కి.మీ మైలేజ్.. టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
ఇండియాలో పెట్రోల్ ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఓ అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో పెట్రోల్ స్కూటర్ల కంటే ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈవీలు కేవలం పర్యావరణ హితమే కాకుండా.. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో వందల కిలోమీటర్లు ప్రయాణించే వీలుండటంతో వినియోగదారులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా 2026 నాటికి మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 5 లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలిసుకుందాం.
1. ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్ (Ola S1 Pro Sport).. రేంజ్‌లో రారాజు
ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా ఇందులోని 5.2 kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన 'ఎస్1 ప్రో స్పోర్ట్' వేరియంట్ అద్భుతమైన పనితీరును కనబరుస్తోంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 320 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. మీరు రోజుకు 40 కిలోమీటర్లు ప్రయాణించినా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం మొత్తం సరిపోతుంది. దీని గరిష్ట వేగం గంటకు 141 కి.మీ కావడం మరో విశేషం. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1,64,999 గా ఉంది.

2. సింపుల్ వన్ జెన్ 2 (Simple One Gen 2)
తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సింపుల్ ఎనర్జీ తన 'జెన్ 2' మోడల్‌తో రేంజ్ ఆందోళనను దూరం చేసింది. ఇందులో 5 kWh బ్యాటరీని అమర్చారు. ఇది 265 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుంది. దీని మోటార్ 8.8 kW శక్తిని ఉత్పత్తి చేస్తూ, కేవలం 2.55 సెకన్లలోనే 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. స్పోర్టీ లుక్ ఇష్టపడే యువతకు ఇది చక్కని ఎంపిక. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1,77,999గా ఉంది.
3. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ (TVS iQube ST)
సంప్రదాయ స్కూటర్ల తయారీలో దిగ్గజమైన టీవీఎస్.. ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్‌తో ఈవీ మార్కెట్లో పోటీ పడుతోంది. ఇందులో 5.3 kWh బ్యాటరీని అమర్చారు, ఇది 212 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఫ్యామిలీ అవసరాలకు తగ్గట్టుగా ఇందులో 32 లీటర్ల బూట్ స్పేస్, 7-అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. నగర ప్రయాణాలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండే ఈ స్కూటర్ ధర రూ.1,62,704 గా ఉంది.
4. రివర్ ఇండీ (River Indie)
ప్రయోగాత్మక డిజైన్‌తో వచ్చిన రివర్ ఇండీ.. గరుకు రోడ్లపై కూడా సునాయాసంగా ప్రయాణించేలా రూపొందించబడింది. అందుకే దీనిని 'ఎస్యూవీ ఆఫ్ స్కూటర్స్(SUV of Scooters)' అని పిలుస్తారు. ఇందులోని 4 kWh బ్యాటరీ ప్యాక్ 161 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. 14-అంగుళాల పెద్ద చక్రాలు, క్రాష్ గార్డ్స్, 43 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ దీని ప్రత్యేకతలు. లోడ్ ఎక్కువగా మోసే వారికి ఇది సరైన వాహనం. దీని ధర రూ.1,42,999 (ఎక్స్-షోరూమ్).
5. ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ మ్యాక్స్ (Pure EV Epluto 7G Max)
బడ్జెట్ ధరలో ఎక్కువ రేంజ్ ఆశించే వారికి ప్యూర్ ఈవీ ఒక మంచి ఆప్షన్. దీని '7జీ మ్యాక్స్' మోడల్ 3.5 kWh బ్యాటరీతో వస్తుంది. ఇది వాతావరణ పరిస్థితులు, డ్రైవింగ్ మోడ్‌ను బట్టి 150 నుంచి 211 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదు. క్లాసిక్ రెట్రో లుక్, స్మార్ట్ బీఎమ్ఎస్ (Battery Management System) దీనికి అదనపు బలాలు. దీని ధర కేవలం రూ. 1,17,699 మాత్రమే.












Click it and Unblock the Notifications