ట్రంప్-మోదీ డీల్ ఎఫెక్ట్: ఖాతాల్లోకి రూ. 13 లక్షల కోట్లు!
Share Market Update: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఫిబ్రవరి 3 ఓ చిరస్మరణీయమైన రోజుగా నిలిచిపోతుంది. కేంద్ర బడ్జెట్ 2026 తర్వాత కొంత అస్థిరతకు లోనైన మార్కెట్లు ఒక్కసారిగా వచ్చిన అమెరికా డీల్ వార్తతో ఉప్పెనలా ఎగిసిపడ్డాయి. పెట్టుబడిదారుల ముఖాల్లో మునుపెన్నడూ లేని ఉత్సాహం కనిపిస్తోంది.
రికార్డు స్థాయి లాభాలు.. ఇన్వెస్టర్ల పండగ
ఈ రోజు ట్రేడింగ్‌లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 4,205 పాయింట్లు పెరిగి 85,871 గరిష్ట స్థాయిని తాకడం విశేషం. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 50 కూడా 1,250 పాయింట్లకు పైగా లాభపడి 26,341 వద్ద ట్రేడ్ అయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద కేవలం కొన్ని గంటల్లోనే రూ. 13 లక్షల కోట్లు పెరగడం మార్కెట్ బలాన్ని చాటిచెబుతోంది.

స్టాక్ మార్కెట్ లాభాల వెనుక అసలు కథ ఇదే..
ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య ఒప్పందం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గతం ఇండియాపై విధించిన 25 శాతం అదనపు పెనాల్టీ సుంకాన్ని అమెరికా పూర్తిగా ఎత్తివేసింది. భారత ఉత్పత్తులపై ఉన్న ప్రాథమికి సుంకాన్ని కూడా 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ప్రతిగా భారత్ కూడా అమెరికా నుంచి శక్తి వనరులు, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులను భారీగా దిగుమతి చేసుకోవడానికి అంగీకరించింది. ఇది మన ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లో పెద్ద ఊరటనిచ్చింది.
ఐటీ, ఆటో, టెక్స్‌టైల్ రంగాల దూకుడు
సుంకాల తగ్గింపు వల్ల ఎక్కువగా లాభపడేది ఎగుమతి ఆధారిత రంగాలే. అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడే ఐటీ(టీసీఎస్, ఇన్ఫోసిస్) కంపెనీలు, ఆటోమొబైల్, టెక్స్‌టైల్ రంగాల షేర్లు ఈరోజు విపరీతంగా పెరిగాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా భారీగా కొనుగోళ్లు జరపడం మార్కెట్‌కు వెన్నుముకగా నిలిచింది.
ఐటీసీ ఎందుకు నష్టపోయింది?
మార్కెట్ మొత్తం ఆనందంలో ఉన్నా.. ఐటీసీ షేరు మాత్రం నష్టాల్లో సాగడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. దీనికి ప్రధాన కారణం ఇటీవలే ప్రభుత్వం సిగరెట్లపై ప్రకటించిన అదనపు ఎక్సైజ్ డ్యూటీ. ఈ పన్నుల భారం వల్ల కంపెనీ లాభదాయకతపై ప్రభావం పడుతుందనే ఆందోళనతో ఇన్వెస్టర్లు ఈ షేరును విక్రయించడానికి మొగ్గు చూపారు. ప్రస్తుతానికి మార్కెట్ సానుకూలంగా ఉన్నప్పటికీ.. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. భారత్-అమెరికా అధ్య కుదిరిన ఈ ఒప్పందం అమలులోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ఈ లోగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, రూపాయి విలువలో మార్పులను గమనిస్తూ ఉండటం అవసరం.












Click it and Unblock the Notifications